Airfare | న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రస్తుత పండుగ సీజన్లో భారీగా పెరిగిన విమాన టికెట్ చార్జీలు దీపావళి నాటికి తగ్గే అవకాశాలున్నాయి. దివాళీ, ఛత్ పూజ నాటికి దేశవ్యాప్తంగా విమాన టికెట్ ధరలు గతేడాదితో పోలిస్తే 20-25 శాతం వరకు తగ్గనున్నాయని అంచనా ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో అంచనావేస్తున్నది. సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఇటీవలకాలంలో చమురు ధరలు దిగిరావడంతో విమాన చార్జీలు తగ్గించడానికి పలు విమానయాన సంస్థలు కసరత్తు చేస్తున్నాయని తెలిపింది. బెంగళూరు-కోల్‌కతాల మధ్య విమాన చార్జీలు సరాసరిగా 38 శాతం వరకు తగ్గనుండగా, చెన్నై-కోల్‌కతాల మధ్య 36 శాతం, ముంబై-ఢిల్లీల మధ్య 34 శాతం, ఢిల్లీ-కోల్‌కతా, హైదరాబాద్-ఢిల్లీల మధ్య టికెట్ ధరలు 32 శాతం వరకు తగ్గనున్నాయి.
హెచ్‌సీఎల్ టెక్ లాభం 4,235 కోట్లు
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: హెచ్‌సీఎల్ టెక్నాలజీ ఆశాజనక ఆర్థిక ఫలితాలను అందుకున్నది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,235 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,832 కోట్ల లాభంతో పోలిస్తే 10.51 శాతం వృద్ధిని కనబరిచింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.26,672 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం రూ.26,672 కోట్లకు ఎగబాకింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ విజయకుమార్ మాట్లాడుతూ..డాటా, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి టెక్నాలజీ సేవలకు డిమాండ్ అధికంగా ఉన్నదని, ఈ విభాగం నుంచి అధికంగా ఆర్డర్లు వస్తున్నాయన్నారు.