టీవీఎస్‌లో ఆస్తుల పంచాయతీ.. రచ్చకెక్కిన వేణు శ్రీనివాసన్ కుటుంబ విభేదాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త, టీవీఎస్ మోటర్ కంపెనీ-టీవీఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌ల చైర్మన్ ఎమిరేట్స్ వేణు శ్రీనివాసన్ కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి.
- ఇంకా అపరిష్కృతంగానే పంపకాలు?
- శ్రీనివాసన్ భార్య మల్లిక, కూతురు లక్ష్మీ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: యాజమాన్య హక్కులు, వ్యాపార ఆస్తుల విభజన లెక్కలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని శ్రీనివాసన్ భార్య మల్లికా శ్రీనివాసన్, కూతురు లక్ష్మీ వేణు చెప్తున్నారు. ఈ మేరకు తాజాగా విడుదలైన ఓ సంయుక్త ప్రకటనలో ఆ ఇరువురు స్పష్టం చేశారు. కుటుంబ విభేదాల పరిష్కారానికి ఎలాంటి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరుగలేదని పేర్కొన్నారు. ‘ఈ వివాదం టీవీఎస్ గ్రూపునకు చెందిన ఆయా కంపెనీల్లో హోదాలకు సంబంధించి కాదు. యాజమాన్య హక్కులు, న్యాయబద్దమైన వారసత్వ గుర్తింపునకు సంబంధించినది’ అన్నారు. అలాగే పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగడం లేదని ఆరోపించారు. టీవీఎస్ మోటర్ కంపెనీ, దాని హోల్డింగ్స్ సంస్థలో వారసత్వం అంశాలపై కుటుంబంలో అభిప్రాయ భేదాలున్నాయన్న వార్తల నడుమ మల్లిక, లక్ష్మీ ప్రకటన మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు.
ఒప్పందాలతో మొదలై..
టీవీఎస్‌లో ఆస్తుల గొడవ.. వేణు శ్రీనివాసన్, ఆయన భార్య మల్లికా శ్రీనివాసన్, కూతురు లక్ష్మీ వేణు, కుమారుడు సుదర్శన్ వేణుల మధ్యే జరుగుతున్నది. ఈ వ్యవహారంలో తండ్రీకొడుకులు ఒక గ్రూపైతే.. తల్లీకూతుళ్లు మరొక గ్రూప్. ఇక అసలు ఈ లొల్లికి కేంద్ర బిందువులు.. 2020 డిసెంబర్లో జరిగిన కుటుంబ ఒప్పందం, 2024 మార్చిలో చేసుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ). అవును.. ఈ అగ్రిమెంట్లు కేవలం వ్యాపార నిర్వహణ కోసమేనని లక్ష్మీ వేణు అంటుండగా, కాదు.. ఆస్తుల యాజమాన్య బదిలీకి సంబంధినవి అని సుదర్శన్ వేణు అంటున్నారు. దీంతో ఇప్పుడు లక్ష్మీ వేణు కోర్టులకెక్కే ఆలోచనల్నీ చేస్తుండటం గమనార్హం. అయితే కంపెనీ చట్టాలు కూడా ఈ వ్యవహారంలో కీలకం కానున్నాయి. ఇక ఇప్పటికే సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇరువర్గాలు భేటీ కూడా అయ్యాయి.
ఇదీ సంగతి..
వేణు శ్రీనివాసన్ వర్గం.. సదరు ఒప్పందాలు టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటర్ కంపెనీ యాజమాన్య హక్కులు సుదర్శన్‌కు వర్తిస్తాయని స్పష్టం చేస్తున్నట్టు చెప్తున్నది. అలాగే లక్ష్మీ వేణుకు సుందరం క్లేటన్, గ్రూప్‌నకు చెందిన చిన్న వ్యాపారాలు చెందుతాయని అంటున్నారు. అయితే లక్ష్మి ఈ వాదనను ఖండిస్తున్నారు. ఆ ఒప్పందాలు వ్యాపారపరమైన పాలనా విధుల కోసమేనని చెప్తున్నారు. యాజమాన్య హక్కుల బదిలీకి సంబంధించి నియమావళిని సూచించలేదని అంటున్నారు. కాగా, 2020 డిసెంబర్లో జరిగిన తొలి ఒప్పందంలో టీవీఎస్ వ్యవస్థాపకుడైన టీవీ సుందరం అయ్యంగార్ వారసులు రాజం, కృష్ణా, సంతానం, శ్రీనివాసన్, దొరైస్వామి శాఖల మధ్య నోటి మాట మీద కుదిరిన అవగాహనే.
ఇది కుటుంబ శాఖల మధ్య నియంత్రణను పునర్వ్యవస్థీకరించడం, సంబంధిత వ్యాపార యాజమాన్యాల నిర్వహణను సమన్వయపర్చడం కోసమేనని చెప్తున్నారు. అయితే 2024 మార్చిలో కుదిరిన ఎంవోయూపై వేణు, మల్లిక, లక్ష్మి, సుదర్శన్ అంతా సంతకాలు చేశారు. ఇందులో టీవీఎస్ బ్రాండ్ వినియోగం, ఇతరత్రా అంశాలున్నాయి. అయినప్పటికీ టీవీఎస్ హోల్డింగ్స్ ఇందులో భాగం కాలేదు. కానీ 2025 ఏప్రిల్‌లో వేణు శ్రీనివాసన్.. టీవీఎస్ హోల్డింగ్స్‌లో ఉన్న 6.79 శాతం వాటాను వీఎస్ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల వివరాలు చెప్తున్నాయి.
అలాగే వీఎస్ ట్రస్ట్, శ్రీనివాసన్ ట్రస్ట్ రెండింటి ద్వారా టీవీఎస్ హోల్డింగ్స్‌లో బెనిఫీషియల్ ఓనర్‌గా సుదర్శన్ వేణును తదనంతర ఫైలింగ్‌లు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యుల నడుమ ఆస్తుల పంచాయతీ తారస్థాయికి చేరుకున్నది. టీవీఎస్ గ్రూప్‌ను 1911లో టీవీ సుందరం అయ్యంగార్ ప్రారంభించారు. టీవీఎస్ మోటర్ కంపెనీలో టీవీఎస్ హోల్డింగ్స్‌కు 50.26 శాతం వాటా ఉన్నది. ప్రస్తుతం టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీగా సుదర్శన్ వేణు ఉన్నారు. అలాగే టీవీఎస్ హోల్డింగ్స్‌కు లక్ష్మీ వేణు ఎండీగా వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

