Financial Management | ఆర్థిక ప్రగతిని సాధించాలంటే క్రమశిక్షణ ఎంత అవసరమో.. కొన్ని దురలవాట్లను దూరం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా పెట్టుబడులు, పొదుపు, ఖర్చులు ఇలా పలు అంశాల్లో తెలివిగా వ్యవహరించాలి.
ఆలోచించకుండా తొందరపాటుతో స్టాక్ మార్కెట్లలో నేరుగా పెట్టుబడులకు దిగితే నష్టాలే. పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే ఇండివీడ్యువల్ స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి. ఇక చిన్న మదుపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ రిసెర్చ్ చేయకుండా మదుపు చేయరాదు. రిటైల్ ఇన్వెస్టర్లూ నిపుణులను సంప్రదించిగానీ స్టాక్స్ కొనుగోళ్లకు దిగవద్దు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపట్ల ఆసక్తి ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ముందుకెళ్లవచ్చు.
అత్యవసర నిధిపై చాలామంది అశ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా నేటి యువతరం సరదాలు, సంతోషాలకే ప్రాధాన్యతనిస్తూ ఖర్చులకు తెగబడుతున్నారు. క్రెడిట్ కార్డులు, మొబైల్ వ్యాలెట్లు అంటూ విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. అందుకే కొంత నగదు మొత్తాలతో ఎమర్జన్సీ ఫండ్‌ను సృష్టించుకోవాలని సలహా.
బీమాను చిన్నచూపుతో చూడవద్దు. అలాగే దీన్నో పన్ను ఆదా సాధనంగా పరిగణించవద్దు. పాలసీలను పన్ను కోణంలో చూసి కొంటే.. దాని ప్రయోజనాలు పూర్తిగా అందవు. కాబట్టి ఆపత్కాలంలో అన్నివిధాల అండగా ఉండే బీమానే ఎంచుకోవాలి.
ఆదాయం ఉన్నదికదా అని నేడు చాలామంది ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారు. క్రెడిట్ స్కోర్ బాగుందంటూ ఎవరు ఏ రకంగా లోన్ ఇస్తామన్నా వద్దనకుండా తీసేసుకుంటున్నారు. దీనివల్ల రుణ భారం పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉన్నది.