హైదరాబాద్, జనవరి 17: రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తున్న డిజిలాజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ఐపీవోకి రాబోతున్నది. ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు వాటాలను విక్రయించనుండగా, ధరల శ్రేణిని రూ.98 నుంచి రూ.104 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 19న యాంకర్ పెట్టుబడిదారుల కోసం కేటాయించనుండగా, 20 నుంచి 22 వరకు సాధారణ ఇన్వెస్టర్ల కోసం కేటాయించింది.
ఈ వాటాల విక్రయంతో రూ.69.67 కోట్ల నిధులను సమీకరించనుండగా, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.11.33 కోట్లను సేకరించనున్నది. మొత్తంగా రూ.80 కోట్ల నిధుల్లో రూ.51.73 కోట్ల నిధులతో నూతన ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి వినియోగించనుండగా, మరో రూ.8 కోట్లను రుణాలను తీర్చడానికి కేటాయించనున్నట్టు ప్రకటించింది. మిగతా నిధులను వ్యాపార విస్తరణకోసం, ఇతర ఖర్చుల నిమిత్తం కేటాయించనున్నది. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫాం కింద కంపెనీ షేరు లిస్ట్ కానున్నది.