Dhanlaxmi Bank | ప్రైవేట్ బ్యాంక్ ధనలక్ష్మి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా కేకే అజిత్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 20న ఎండీగా అజిత్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారని కేరళ కేంద్రంగా పని చేస్తున్న ధనలక్ష్మి బ్యాంకు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. బ్యాంక్ ఎండీ కం సీఈఓగా అజిత్ కుమార్ నియామకానికి బ్యాంకు బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. జూన్ 20 నుంచి మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కంపెనీల చట్టం-2013, సెబీ నిబంధనలకు అనుగుణంగా అజిత్ కుమార్ నియామకానికి వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉందని ధనలక్ష్మి బ్యాంకు పేర్కొంది. అజిత్ కుమార్‌కు బ్యాంకింగ్ రంగంలో 36 ఏండ్ల అనుభవం ఉంది. ఫెడరల్ బ్యాంకులో క్రెడిట్, హ్యుమన్ రీసోర్సెస్, బిజినెస్, బ్రాంచ్ బ్యాంకింగ్ రంగాల్లో సేవలందించారు. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ అధ్యక్షుడి హోదాలో చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.