హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్దే లక్ష్యంగా జపాన్‌లోని కిటాక్యూషు నగర స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. తెలంగాణ, కిటాక్యూషు మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) సంయుక్తాధ్వర్యంలో టీహబ్ లో ‘ఫ్రం కిటాక్యూషు టూ తెలంగాణ-కేటలైసింగ్ ససె్టైనబుల్ ఇండస్ట్రియల్ గ్రోథ్’ అనే అంశం నిర్వహించిన సదస్సులో ఆయర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. రాష్ట్రంలో జపాన్ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణకు చెందిన 50 మంది యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు లభించాయని, మరింత మందికి దకేలా టామ్‌కామ్ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా జపనీస్ భాషను నేర్పిస్తామన్నారు.