Swiss Bank | న్యూఢిల్లీ, జూన్ 20: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, దేశీయ సంస్థల డిపాజిట్లు మరింత తగ్గాయి. వరుసగా రెండో ఏడాది 2023లోనూ స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు 70 శాతం తగ్గి నాలుగేండ్ల కనిష్ఠ స్థాయి రూ.9,771 కోట్ల(1.04 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్)కు పరిమితమయ్యాయని స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2021లో 14 ఏండ్ల గరిష్ఠ స్థాయి 3.83 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్కి చేరుకున్న డిపాజిట్లు ఆ తర్వాత వరుసగా రెండేండ్ల పాటు తగ్గుముఖం పట్టడం విశేషం. బాండ్లు, సెక్యూరిటీ, ఇతర ఆర్థిక మార్గాల ద్వారా వచ్చిన పెట్టుబడుల ఆధారంగా సెంట్రల్ బ్యాంక్ ఈ నివేదికను రూపొందించింది. అయినప్పటికీ స్విట్జర్లాండ్లో భారతీయులు కలిగివున్న నల్లధనం ఎంత అనేది ఇప్పటికీ తెలియరాలేదు. ఇండియన్స్, ఎన్ఆర్ఐలు లేదా ఇతరులు స్విస్ బ్యాంకుల్లో ఇతర దేశాలకు చెందిన సంస్థల పేర్లతో పెట్టిన డిపాజిట్లను ఈ గణాంకాల్లో చేర్చలేదు. 2006లో రికార్డు స్థాయిలో 6.5 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాతి తగ్గుముఖం పట్టాయని తన నివేదికలో వెల్లడించింది.