
JhanDhan A/C Diposits | పేద, అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఏడున్నరేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్ల మార్క్‌ను దాటాయి. 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ పేదల కోసం జన్‌ధన్ ఖాతాలను ప్రారంభిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం 2021 డిసెంబర్ నెలాఖరు నాటికి 44.23 కోట్ల ఖాతాల్లో రూ.1,50,939.36 కోట్ల నిధులు సమకూరాయని కేంద్ర ఆర్థికశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
44.23 కోట్ల ఖాతాల్లో 34.9 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, 8.05 కోట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 1.28 కోట్ల ఖాతాలు ప్రైవేట్ బ్యాంకులవని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. వీటిలో 31.28 కోట్ల పీఎంజేడీవై లబ్ధి దారులకు రూపే డెబిట్ కార్డులు జారీ చేశామని తెలిపింది. వీరిలో అత్యధికులు తమ రూపే కార్డులను వాడుతున్నారు.
మొత్తం జన్‌ధన్ ఖాతాల్లో 29.54 కోట్ల ఖాతాలు గ్రామీణ, సెమీఅర్బన్ బ్యాంకు శాఖల పరిధిలో ఉన్నాయి. 2021 డిసెంబర్ 29 నాటికి 24.61 కోట్ల మంది మహిళలకు జన్‌ధన్ ఖాతాలు ఉన్నాయి. తొలి ఏడాది 17.90 పీఎంజేడీవై ఖాతాలను ప్రారంభించారు. 2021 డిసెంబర్ 8 నాటికి 3.65 కోట్ల ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. జన్‌ధన్ ఖాతాల్లో స్కాలర్షిప్లు, సబ్సిడీలు, పెన్షన్లు, కోవిడ్ రిలీఫ్ ఫండ్స్ తదితర బెనిఫిట్ల సొమ్ము నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా జమ అవుతాయి.