న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. దీంతో డీమ్యాట్ ఖాతాలు తెరిచేవారు కూడా అధికమవుతున్నారు. గత నెలలో కొత్తగా 40 లక్షల మంది డీమ్యాట్ ఖాతాలు తెరవడంతో మొత్తం సంఖ్య 17 కోట్లకు చేరుకున్నాయని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
గత నెలలో రికార్డుస్థాయిలో ఐపీవోలు జరగడం ఇందుకు కారణం. 10 కంపెనీలు ఐపీవో ద్వారా రూ.17 వేల కోట్ల నిధులను సేకరించాయి. ప్రస్తుతేడాది ప్రతి నెలలో సరాసరిగా 40 లక్షల చొప్పున డీమ్యాట్ ఖాతాలు తెరవడంతో మొత్తంగా 3.2 కోట్లు తెరిచారు. 2024 జనవరి నుంచి ఆగస్టు 31 వరకు 50 కంపెనీలు ఐపీవోకి రాగా, ఈ సంస్థలు మొత్తంగా రూ.53 వేల కోట్ల నిధులను సమీకరించాయి. అలాగే ఈ ఏడాది సెన్సెక్స్ 13 శాతం రిటర్నులు పంచగా, నిఫ్టీ 15 శాతం రిటర్నులు పంచింది.