Gold Loan | న్యూఢిల్లీ, జూలై 25: పెరుగుతున్న బంగారం ధరలతో బ్యాంకుల గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోల్లో ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 18 నుంచి 52 శాతం వరకు పసిడి రుణాల్లో పెరుగుదల నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే వ్యవధిలో 12 నుంచి 33 శాతం వృద్ధి మాత్రమే ఉన్నది. ఈ ఏప్రిల్-జూన్‌లో బంగారం ధరల్లో పెరుగుదలే ఇందుకు కారణమని బ్యాంకింగ్ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఇచ్చే ఈ రుణాల్లో మార్కెట్లో పసిడి విలువ ఎంత ఎక్కువగా ఉంటే అంత అధికంగా అప్పును పొందవచ్చన్న విషయం తెలిసిందే. దీంతో లోన్ టు వాల్యూ (ఎల్టీవీ) ప్రకారం రుణగ్రహీతలకు ఇప్పుడు వారి బంగారంపై మరింత రుణం వస్తున్నది. ఫలితంగా ఈ లోన్లకు గిరాకీ ఏర్పడుతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం 2021 ఏప్రిల్ 1 తర్వాత ఎల్టీవీ రేషియో 75 శాతానికి చేరింది. దీంతో బంగారు ఆభరణాల ధరలో 75 శాతం వరకు రుణంగా పొందవచ్చు. కాగా, గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరల్లో 17-20 శాతం పెరుగుదల నమోదైనట్టు ఇక్రా ఉన్నతాధికారి ఆశే చోక్సీ, కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈవో బీ రమేశ్ బాబు తెలిపారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బంధన్ బ్యాంక్, సీఎస్బీ, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ తదితర బ్యాంకులన్నింటిలో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియోల్లో వృద్ధి బాగా కనిపిస్తున్నది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీఎస్బీ బ్యాంక్‌లు గతంతో పోల్చితే 52.93 శాతం, 42 శాతం చొప్పున వృద్ధిని చూసినట్టు ప్రకటించాయి. అలాగే కెనరా బ్యాంక్ 29.37 శాతం, బంధన్ బ్యాంక్ 32.08 శాతం, సౌత్ ఇండియన్ బ్యాంక్ 21 శాతం, ఫెడరల్ బ్యాంక్ 13.3 శాతం చొప్పున పెరుగుదలను చూశాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ 17.53 శాతం వృద్ధిని చూడగా.. చాలా రుణాలు ఏడాది, రెండేండ్ల వ్యవధితోనే ఉంటాయని, వీటికి పంట రుణాలతో అనుసంధానిస్తూ 8.75 శాతం నుంచి 9 శాతం మధ్యే వడ్డీరేట్లుంటాయని బ్యాంక్ ఎండీ రమేశ్ బాబు తెలిపారు.
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు రూ.4,500లకుపైగా పుంజుకున్నాయి. మార్చిలో 10 గ్రాములు దాదాపు రూ.55,000లుగానే ఉన్నది. కానీ జూన్‌లో రూ.60,000లకుపైగా పలికినట్టు బ్లూంబర్గ్ గణాంకాలు చెప్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, దేశీయంగా పెండ్లిళ్లు, పండుగల సీజన్ కావడం.. గోల్డ్ రేట్లను పరుగులు పెట్టిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్లో ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టి సుమారు రూ.59,000 స్థాయిలోనే కదలాడుతున్నాయని చెప్తున్నారు. ఇక నిరుడు ఏప్రిల్-జూన్‌లో పుత్తడి తులం ధర రూ.50,000-52,000 శ్రేణిలో ఉన్నదని, ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో రూ.58,000-60,000 స్థాయికి పెరిగిందని కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. ఈ క్రమంలోనే బంగారం ధర ఎంత పెరిగితే.. అంత ఎక్కువ గోల్డ్ లోన్ పొందవచ్చని చెప్పారు. అందుకే ఇంత డిమాండ్ అని విశ్లేషిస్తున్నారు.
బంగారం రుణాలకు రాబోయే రోజుల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కూడా ధరలు దూకుడు మీదే ఉంటాయని చెప్తున్నారు. నిజానికి ఈమధ్య ధరలు 4-5 శాతం మేర పడిపోయాయని, అయినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు, గ్లోబల్ మార్కెట్ల తీరుతెన్నులు.. మదుపరులను బంగారం వైపే తీసుకెళ్తున్నాయని గుర్తుచేస్తున్నారు. దీంతో గోల్డ్‌కు డిమాండ్ ఇప్పట్లో తగ్గబోదన్న అంచనాలు గట్టిగానే వినిపిస్తున్నాయిప్పుడు.