‘గోల్డ్ ఈజ్ ఎవర్గ్రీన్’.. అవును.. ధరలు పెరుగుతున్నా బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గడం లేదుమరి. పసిడికున్న బహుళ ప్రయోజనాలు.. కస్టమర్లను దుకాణాల్లోకి నడిపిస్తున్నాయి. ఇక పండుగలు, ప్రత్యేక దినాల్లో వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి.ఈ ఏడాది అక్షయ తృతీయకు నిరుడుతో పోల్చితే అమ్మకాలు 40 శాతం పుంజుకోవడం ఇందుకు నిదర్శనం. రాబోయే ధనత్రయోదశికీ ఇదే ఉత్సాహం మార్కెట్లో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 24: కాలానికి అనుగుణంగా కనకం ధరలూ పరుగులు పెడుతున్నాయి. రేట్లు ఎంత పెరిగినా మార్కెట్లో మాత్రం గోల్డ్కున్న డిమాండ్ అస్సలు తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే వ్యాపారుల అంచనాల్ని తలకిందులు చేసేలా విక్రయాలు సాగుతున్నాయి మరి. ఈ ఏడాది అక్షయ తృతీయ అమ్మకాలే ఇందుకు నిదర్శనం. నిరుడుతో పోల్చితే ఈసారి 40 శాతానికిపైగా విక్రయాలు పెరిగినట్టు నగల వర్తకులు అంచనా వేస్తున్నారు. తులం ధర దాదాపు రూ.10,000 పెరిగినా విక్రయాలు జోరుగా సాగడంపట్ల ఆభరణాల షాపు యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ధనత్రయోదశికి..
రాబోయే ధనత్రయోదశికి పసిడి అమ్మకాలు భారీ ఎత్తునే ఉంటాయన్న విశ్వాసాన్ని వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ధరలు పెరుగుతాయన్న అంచనాలు తమకు కలిసిరాగలవన్న అభిప్రాయంతో వారున్నారు. దీనికితోడు ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో కస్టమర్లను వీలైనంత ఎక్కువగా ఆకట్టుకోవాలని ఇప్పట్నుంచే వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. నవంబర్‌లో ధనత్రయోదశి రానున్నది. దీంతో ఇప్పుడు కొంత నగదు చెల్లిస్తే.. అప్పుడు ధరలు పెరిగినా ఇప్పుడున్న రేటుకే కొనుక్కోవచ్చని, ప్రస్తుతం చెల్లించిన మొత్తం అందులో మినహాయించబడుతుందన్న ఆఫర్లనూ పలు దుకాణాల యజమానులు పెడుతున్నారు. మొత్తానికి ఈసారి ధనత్రయోదశికి స్వర్ణ కాంతులు ఖాయమనే చెప్తున్నారు.
ఔన్సు 2,500 డాలర్లకు…
వచ్చే ఏడాది ఔన్సు బంగారం ధర గ్లోబల్ మార్కెట్లో 2,500 డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 1,888 డాలర్లుగానే ఉన్నది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు మదుపరులకు ప్రతికూలంగా మారితే.. పెట్టుబడులన్నీ పసిడి వైపు మళ్లుతాయని ట్రేడర్లు చెప్తున్నారు. ఇదే జరిగితే ఔన్సు గోల్డ్ విలువ 2,500 డాలర్లకు చేరుతుందని అంటున్నారు. దేశీయ మార్కెట్లోనూ తులం ధర ఇప్పటితో పోల్చితే మరో రూ.20 వేలు అధికం కానుందని అంటున్నారు. ఇప్పటికే బంగారం ధరలు రూ.60 వేల దరిదాపుల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది రూ.80 వేలను తాకవచ్చని అభిప్రాయపడుతున్నారు.
పొదుపు.. పెట్టుబడి.. అవసరం
బంగారానికి ఉన్న బహుళ ప్రయోజనాలు కూడా దాని డిమాండ్‌ను కొనసాగిస్తున్నాయి. పొదుపు.. పెట్టుబడి.. అవసరం.. ఇలా ఏదైనాసరే అందరికీ పసిడి అందుబాటులో ఉంటున్నది. గత కొన్నేండ్లుగా చూసినైట్టెతే ధరలు ఏటేటా క్రమేణా పెరుగుతున్నాయి. ఇది కూడా కొనుగోలుదారుల్లో ఓ స్థిరమైన నమ్మకాన్ని ఏర్పర్చిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే పొదుపుకైనా.. పెట్టుబడికైనా.. అవసరానికైనా.. బంగారం సరైనదన్న అభిప్రాయం అందరిలో పాతుకుపోయిందంటున్నారు. దీంతోనే ధర ఎంతపెరిగినా.. నష్టం లేదని, ఉన్నంతలో ఎంతోకొంత పసిడి కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారని ఆర్థిక నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఇక ఇటీవలి కాలంలో గోల్డ్ బాండ్స్ కొనుగోళ్లకు ఆదరణ పెరిగిందని అంటున్నారు.
గోల్డ్ లోన్లకు గిరాకీ?
బంగారం రుణాలకూ గిరాకీ పెరుగుతున్నది. నిజానికి ఇవి సెక్యూర్డ్ లోన్ల కిందకు వస్తాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు బంగారు నగలను తాకట్టు పెట్టుకుని, ఆ రోజు మార్కెట్లో వాటి విలువ ఎంతన్నది లెక్కించి, అందులో 70-80 శాతం వరకు రుణంగా ఇస్తాయి. ఒకేసారి మొత్తంగా లేదా కొద్దికొద్దిగా కూడా ఈ రుణా న్ని తీర్చవచ్చు. ప్రస్తుతం ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు గోల్డ్ లోన్లను ఆకర్షణీయ వడ్డీరేట్లకు అందిస్తున్నాయి. రూ.100కు 65 పైసల నుంచి 80 పైసల వడ్డీని మాత్రమే తీసుకుంటున్నాయి. వ్యక్తిగత రుణాలపై ఉండే వడ్డీరేట్లతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఎంతో సులువుగా బంగారాన్ని ఈ రుణాల ద్వారా నగదుగా మార్చుకోవచ్చు. మన తక్షణ అవసరాలకు గోల్డ్ లోన్లు బాగా ఉపయోగపడుతాయి. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తప్ప, పెద్దగా డాక్యుమెంట్ల అవసరం కూడా ఉండదు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, వ్యాపారానికి పెట్టుబడి కోసం బంగారం రుణాలు ఇప్పుడు సౌకర్యవంతంగా ఉంటున్నాయి.
అమాంతం పెరిగిన కంపెనీల విలువ
పసిడి మార్కెట్లోని కంపెనీల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవలి టాటా-క్యారట్‌లైన్ డీల్ ఇందుకు ఉదాహరణగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యారట్లైన్లో 27.18 శాతం వాటాను టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ రూ.4,621 కోట్లతో కొన్నది. నిజానికి అప్పటికే క్యారట్లైన్లో టైటాన్‌కు 71.09 శాతం వాటా ఉన్నది. తాజా లావాదేవీతో 98.28 శాతానికి చేరగా, గతంలో ఈ 71.09 శాతం వాటాను టైటాన్ చాలా చాలా తక్కువ ధరకే అందుకున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2016లో జరిగిన లావాదేవీ సమయంలో క్యారట్‌లైన్ విలువను రూ.563 కోట్లుగానే పరిగణించారు. కానీ ఇప్పుడు రూ.17,000 కోట్లుగా లెక్కగట్టారు. కేవలం 7 ఏండ్లలో సంస్థ విలువ సుమారు రూ.16,600 కోట్లు పెరిగింది. ఇందుకు కారణం క్యారట్‌లైన్ లైట్ వెయిట్ జ్యుయెల్లరీనే. ప్రస్తుతం మార్కెట్లో ఈ రకం నగలకే డిమాండ్ కనిపిస్తున్నది. రోజువారీగా ధరించడానికి అంతా దీన్నే ఎంచుకుంటున్నారు. నగల షాపులవారు సైతం రకరకాల మోడల్స్‌ను ఇందులో పెడుతుండటంతో గిరాకీ పెరిగిపోయింది. క్యారట్‌లైన్ తరహాలోనే మార్కెట్లోని ఇతర కంపెనీల మార్కెట్ విలువా పెరిగిపోతున్నది.
ఫారెక్స్ రిజర్వుల్లో రయ్ రయ్
బంగారం నిల్వకు ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు సైతం పెద్దపీట వేస్తున్నాయి. దేశంలోని విదేశీ మారకపు నిల్వల్లో పెరుగుతున్న బంగారం వాటానే ఇందుకు తార్కాణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వివరాల ప్రకారం ఈ నెల 18 నాటికి మొత్తం ఫారెక్స్ నిల్వల్లో గోల్డ్ వాటా 7.36 శాతం. 2020 జనవరి 3న 6.08 శాతంగానే ఉన్నది. ఇక ఇప్పుడున్న గోల్డ్ రిజర్వ్‌ల విలువ రూ.3.67 లక్షల కోట్లుగా ఉన్నది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారమే కనిపిస్తున్నది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకులూ గోల్డ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి.