ముంబై, జూలై 11: భారత్‌లో డాటా సెంటర్లకు డిమాండ్ నెలకొన్నది. దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడానికి భారీ స్థాయిలో డాటా సెంటర్లను లీజుకు తీసుకుంటున్నాయి. దీంతో వచ్చే ఐదేండ్లలో డాటా సెంటర్ల సామర్థ్యం 3 గిగావాట్లకు చేరుకోనున్నదని అవెండస్ క్యాపిటల్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. డాటా సెంటర్లకు ప్రతియేటా 1-1.5 బిలియన్ డాలర్లు(రూ.12,870 కోట్లకు పైమాటే) పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ పెట్టుబడులు రెండింతలు పెరిగేందుకు ఆస్కారం ఉన్నదని అవెండస్ క్యాపిటల్ తెలిపింది. 2024లో డాటా సెంటర్ల సామర్థ్యం 1.1 గిగావాట్లుగా ఉన్నది. డాటా వినిమయం పెరుగుతుండటం, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ అడప్షన్, పాలసీ నిర్ణయాలు డాటా సెంటర్లకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుత డిమాండ్‌తో 2033 నాటికి 6 గిగావాట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపింది. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సైతం డాటా సెంటర్లకు అనూహ్యంగా స్పందన లభిస్తున్నదని, ఈ విభాగంలో ప్రతియేటా 25-30 శాతం చొప్పున వృద్ధిని సాధిస్తున్నాయని తెలిపింది.
డాటా సెంటర్లను నెలకొల్పే సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వాలని, ముఖ్యంగా భూ కేటాయింపులు, తక్కువకే విద్యుత్ కేటాయింపులు జరుపాలని నివేదిక సూచించింది. అప్పుడే డాటా సెంటర్లను నెలకొల్పడానికి కార్పొరేట్ దిగ్గజాలు ముందుకొచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్న అనంత్ రాజ్ డాటా సెంటర్ల సామర్థ్యాన్ని రెండింతలు పెంచుకోవడానికి 2.1 బిలియన్ డాలర్లు లేదా రూ.18 వేల కోట్ల) మేర పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. దీంతో డాటా సామర్థ్యం 28 మెగావాట్లకు చేరుకోనుండగా, 2031-32 ఏడాది చివరినాటికి రెండింతలు కానున్నదన్నారు.