Textile Stimulus | కరోనా మహమ్మారి ఉత్పాతం.. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫలితంగా ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయిన ధరలు.. మరోవైపు, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ముంచుకొస్తున్నది. దీంతో చైనాతోపాటు అంతర్జాతీయంగా ముడి పత్తి ధర.. దేశీయ ముడి పత్తితో పోలిస్తే 10-20 శాతం ఎక్కువ. అధిక ధర వల్ల దేశీయ స్పిన్నింగ్ మిల్లులకు పత్తి అందుబాటులో లేదు. దీనికి తోడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై కేంద్రం 11 శాతం దిగుమతి సుంకం విధించిందని తమిళనాడు స్పిన్నింగ్ మిల్లుల సంఘం చీఫ్ అడ్వైజర్ వెంకటాచలం చెప్పారు. తత్ఫలితంగా టెక్స్టైల్ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు.
2021-22తో పోలిస్తే, భారత పత్తి చేనేత, ముడి పత్తి ఎగుమతులు గత ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య 29 శాతం తగ్గి 5.406 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2021-22లో ఇదే కాలంలో 7.606 బిలియన్ డాలర్ల విలువ గల పత్తి ఎగుమతులు నమోదయ్యాయి. పత్తి చేనేత దిగుమతులు 6.468 బిలియన్ డాలర్ల నుంచి 4.791 బిలియన్ డాలర్లకు దిగి వచ్చాయి. పత్తి చేనేత ఎగుమతుల్లో క్షీణత 23 శాతం. ముడి పత్తి ఎగుమతులు 62 శాతం తగ్గాయి. 2021తో పోలిస్తే ఈ ఏడాది ముడి పత్తి ఎగుమతులు 1.138 బిలియన్ డాలర్ల నుంచి 435.9 మిలియన్ డాలర్లకు పతనం అయ్యాయి.
దేశీయ పత్తి ధరలు అంతర్జాతీయంగా పోటీ పడలేకపోతున్నాయని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న టెక్స్టైల్ కంపెనీ ప్రతినిధి సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. దేశీయ మార్కెట్లో ప్రతి ఒక్కరూ కాటన్ నుంచి పాలిస్టర్ వాడకం వైపు మళ్లుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ ధరలతో పోటీ పడేందుకు విదేశీ పత్తి దిగుమతిపై సుంకాలు తగ్గించాలని కోరారు. గత అక్టోబర్లో రెడిమేడ్ గార్మెంట్స్ క్యాటగిరీలో ఓవరాల్ మర్చంటైజ్డ్ ఎగుమతులు 16.7 శాతానికి తగ్గి 29.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.