Amazon-Future | రిటైల్ చైన్నెట్వర్క్ ఫ్యూచర్గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన విషయమై అమెజాన్ తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆరోపణలపై త్వరితగతిన విచారణ జరిపించాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ఢిల్లీ హైకోర్టు కోరింది. ఇప్పటికే అమెజాన్‌పై వచ్చిన ఆరోపణలపై 2022 జనవరి నాలుగో తేదీన ఆ సంస్థ ప్రతినిధులను విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు జస్టిస్‌లు డీఎన్ పటేల్, జ్యోతిసింగ్‌లతో కూడిన డివిజన్బెంచ్కు సీసీఐ నివేదించింది.
కార్పొరేట్ దిగ్గజాల మధ్య పోరులో వ్యాపారులను బలి పశువులను చేయొద్దంటూ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్).. ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా ఫ్యూచర్ గ్రూప్‌కు రూ.10 వేల కోట్ల విలువైన సరుకులు సరఫరా చేసిన 6000కి పైగా వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఆ పిల్లో కోరింది. ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్ పెట్టుబడులు పెట్టడానికి అనుమతినిస్తూ ఇంతకుముందు జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని సీసీఐని కెయిట్ కోరింది.
ఫ్యూచర్ కూపన్స్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఫ్యూచర్ రిటైల్‌పై పూర్తి నియంత్రణ సాధించామని అమెజాన్ చేస్తున్న వాదన చట్ట విరుద్ధం అని కెయిట్ వాదన. విదేశీ సంస్థలకు మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్నెట్వర్క్ల యాజమాన్య హక్కులు కల్పించడం భారత చట్టాల ప్రకారం ఇల్లీగల్ అని కెయిట్ పేర్కొన్నది. కనుక అమెజాన్‌కు జారీ చేసిన అనుమతులను రద్దు చేయాలని కెయిట్ అభ్యర్థించింది.
గత మార్చిలోనే సీసీఐలో ఫిర్యాదు చేశామని ఢిల్లీ హైకోర్టుకు కెయిట్ వివరించింది. 2019లో ఫ్యూచర్ కూపన్స్‌లో పెట్టుబడులకు అనుమతి మంజూరు చేయాలని సీసీఐని కోరినట్లు అమెజాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించింది. గత జూన్ 4న దీనిపై అమెజాన్‌కు సీసీఐ నోటీసు జారీ చేసింది. 235 రోజులుగా సీసీఐ దీనిపై నిర్ణయం తీసుకోలేదని కెయిట్ పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై నిర్ణయాన్ని జాప్యం చేయొద్దని వాదించింది. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన విచారణ జరుగుతుందని ఎక్స్చేంజ్ పైలింగ్‌లో ఫ్యూచర్ గ్రూప్ పేర్కొనడంతో మరో 50 రోజులు ఆలస్యం అవుతుందని కెయిట్ పేర్కొంది.