Electric Taxi | ఢిల్లీ నగర పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే టాక్సీలగా అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్యాబ్స్ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీ మండి పడింది. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం వల్ల బైక్ టాక్సీలు రిస్క్‌లో పడటం మాత్రమే కాదు.. లక్షలాది మంది రవాణా అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ సర్కార్ నిర్ణయం పూర్తిగా క్యాబ్ సర్వీసుల రంగాన్ని మూసేయడమేనని పేర్కొంది. ఉబర్, ఓలా వంటి రైడ్ హైలింగ్ కంపెనీలు వాడే వెహికల్స్ నియంత్రణకు కొత్త పాలసీ తేవాలని ఢిల్లీ సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో ఉబర్ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను మాత్రమే టాక్సీలుగా వాడాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయిస్తే లక్ష మందికి పైగా డ్రైవర్ల జీవన విధానం దెబ్బ తింటుందని ఉబర్ పేర్కొంది. ఢిల్లీ వాసుల మొబిలిటీ అవసరాలను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈవీను మాత్రమే టాక్సీలుగా వాడాలన్న ఢిల్లీ సర్కార్ నిర్ణయం అమలు సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీనిపై పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరుపాలని ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్‌కు ఉబర్ సూచించింది.
2040 నాటికి తమ క్యాబ్ ట్యాక్సీలుగా వాడే వాహనాలన్నీ కర్భన రహితంగా మార్చాలని ఉబర్ లక్ష్యంగా పెట్టుకున్నది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లోని ప్రజా రవాణా, మైక్రో మొబిలిటీని కర్బన రహితంగా మార్చాలని ఉబర్ యోచిస్తున్నది. వచ్చే మూడేండ్లలో 25 వేల ఈవీలను క్యాబ్ సర్వీసులుగా వాడనున్నట్లు ఉబర్ ఇటీవల ప్రకటించింది.