న్యూఢిల్లీ, జూన్ 16: గూగుల్ పే, ఫోన్‌పే తదితర యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్‌లలో ఇకపై రోజుకు వినియోగదారులు తమ ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలను పరిమితంగానే చెక్ చేసుకోగలరు. ప్రస్తుతం ఎన్నిసార్లంటే అన్నిసార్లు అకౌంట్ బ్యాలెన్స్‌ను చూసుకునే వీలున్నది. ఇందుకు సంబంధించి ఎలాంటి పరిమితులూ లేవు. కానీ త్వరలో ఈ సదుపాయం ఉండబోదని సోమవారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. యూపీఐ సిస్టమ్‌పై పడుతున్న భారాన్ని తగ్గించడానికి రోజుకు 50 సార్లకు మించి బ్యాలెన్స్ చెకింగ్ వీలుండదని పేర్కొన్నది.
అయితే ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిన తరుణంలో ఈ ఆంక్షలు.. అమాయక కస్టమర్లకు ఇబ్బందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదీగాక లావాదేవీ జరిపిన ప్రతిసారీ ఖాతాలో నగదు మొత్తాలను చెక్ చేసుకోవడం చాలామందికి ఉన్న అలవాటు. కానీ ఇకపై ఈ సౌకర్యానికి బ్రేకులు పడబోతున్నాయి. కాగా, నగదు బదిలీ, స్టేటస్ చెకింగ్స్, వివిధ కారణాలతో బదిలీ అయిన మొత్తాలు తిరిగి ఖాతాల్లోకి వచ్చే సమయాలు ఇక 10 నుంచి 15 క్షణాలేనని ఎన్పీసీఐ తెలిపింది. ఇప్పటిదాకా ఈ సమయం 30 సెకండ్లుగా ఉన్నది. అలాగే యూపీఐ పేమెంట్‌లో వ్యాలిడేట్ అడ్రస్‌కు తీసుకునే సమయం కూడా 10 సెకండ్లేనన్నది. ప్రస్తుతం 15 సెకండ్లు పడుతున్నది.