Budget Boost | దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం పండుగ వాతావరణం నెలకొంది. సాధారణంగా బడ్జెట్ నాడు నెగెటివ్‌గా స్పందించే స్టాక్ మార్కెట్లు ఈదఫా చాలా సానుకూలంగా రియాక్టయ్యాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సుమారు 1.5 శాతం లబ్ధితో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 848.40 పాయింట్లు (1.46 శాతం) పెరిగి 58,862.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ-50 నిఫ్టీ 237 పాయింట్ల లబ్ధి (1.37 శాతం)తో 17,576.85 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతకుముందు ట్రేడింగ్ ప్రారంభంలోనే రెండు సూచీలో 0.8 శాతానికి పైగా లాభాలతో మొదలయ్యాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తున్నప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1.7 శాతం పెరిగి గరిష్ఠంగా 59,032.20 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ గరిష్టంగా 17,622.40 పాయింట్లకు దూసుకెళ్లింది.