న్యూఢిల్లీ, జూలై 15: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.658.71 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.642.89 కోట్లతో పోలిస్తే కేవలం 2.5 శాతం మాత్రమే పెరిగింది. దుస్తులు, గృహోపకరణాల వస్తువుల విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లపై ప్రభావం చూపిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం 18.20 శాతం పెరిగి రూ.11,865.44 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.10,038.07 కోట్లుగా ఉన్నది. నిర్వహణ ఖర్చులు రూ.11,006. 92 కోట్లకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అవెన్యూ సూపర్మార్ట్స్ సీఈవో, ఎండీ నెవిల్లీ నోరోన్హా మాట్లాడుతూ..అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో గతేడాదితో పోలిస్తే గత త్రైమాసికంలో మార్జిన్లు తగ్గాయన్నారు. గత త్రైమాసికంలో కొత్తగా మూడు స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 327కి చేరుకున్నది.