D-Mart Q1 Results | దేశంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ల నెట్వర్క్ గల సంస్థ ‘డీమార్ట్’ అలియాస్ అవెన్యూ సూపర్ మార్ట్స్ జూన్ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం స్వల్పంగా పెరిగింది. రెవెన్యూలో రెండంకెల గ్రోత్ నమోదైనా 2022-23తో పోలిస్తే గత జూన్ త్రైమాసికంలో కేవలం 2.3 శాతం నికర లాభం మాత్రమే గడించింది.
గతేడాది (2022-23) జూన్ త్రైమాసికంలో రూ.642.89 కోట్ల నికర లాభం గడించిన డీమార్ట్.. ఈ ఏడాది (2023-24) జూన్ త్రైమాసికంలో రూ.658.71 కోట్ల నికర లాభంతోనే సరిపెట్టుకున్నది.
కంపెనీ కార్యకలాపాలతో వచ్చే ఆదాయం 18.24 శాతం పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అవెన్యూ సూపర్ మార్ట్స్ వెల్లడించింది. జూన్ త్రైమాసికం ఆదాయం రూ.11,584.40 కోట్లు వచ్చిందని తెలిపింది. ఆదాయంతో పోలిస్తే ఖర్చు20 శాతం పెరిగి రూ.10,700 కోట్లకు చేరిందని డీమార్ట్ తెలిపింది. ఉద్యోగుల వేతన భత్యాల ఖర్చు 13.4 శాతం పెరిగి రూ.178 కోట్లకు చేరుకుంది.
గతేడాదితో పోలిస్తే సాధారణ వస్తువులు, దుస్తుల కొనుగోళ్లు తగ్గాయని అవెన్యూ సూపర్ మార్ట్స్ సీఈఓ నెవిల్ నొరోన్హా తెలిపారు. అందువల్లే గతేడాది కంటే తక్కువ మార్జిన్లు వచ్చాయన్నారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మూడు కొత్త స్టోర్లు ప్రారంభించామని నెవిల్ నొర్హోన్హా చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ల సంఖ్య 327కి చేరింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ-ఎన్సీఆర్, ఛత్తీస్ ఘడ్, పంజాబ్ రాష్ట్రాల్లో డీమార్ట్ స్టోర్లు నడుస్తున్నాయి.