హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పరిశ్రమలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఏఐ సమ్మిట్-2026లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 515 జీసీసీలు సుమారు 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరాయని, దాదాపు 10 లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారని వివరించారు. తెలంగాణలో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోందని, జీసీసీ ఎకోసిస్టమ్ పెరుగుతున్నదన్నారు.
ఏఐని వినియోగిస్తూ ప్రపంచ మార్కెట్ల కోసం ఏఐ ఉత్పత్తులు, వ్యాపారాలను నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఏఐ ఆవిష్కరణల సంస్థ ఐకాన్, ఏఐ ఫస్ట్ స్టార్టప్‌లు, పరిశోధన-పరిశ్రమల అనుసంధానం, నైపుణ్యాభివృద్ధితో 2035 నాటికి రాష్ర్టాన్ని ప్రపంచంలోని టాప్-20 ఏఐ హబ్‌లలో ఒకటిగా నిలుపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీఈ అండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, సీఐఐ రాష్ట్ర చైర్మన్, రీసస్టెయినబిలిటీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎం.గౌతమ్ రెడ్డి, స్టార్టప్స్ ప్యానెల్ కో కన్వీనర్ ఎంవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.