Russia-Ukraine Tension | రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న టెన్షన్ల నేపథ్యంలో క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ భారీగా పతనం అవుతోంది. రెండు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య టెన్షన్ల నేపథ్యంలో గత వారం 40 వేల డాలర్ల దిగువకు పడిపోయిన క్రిప్టో మేజర్ బిట్ కాయిన్.. బంగారం ముందు విలవిల్లాడుతున్నది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 36 వేల డాలర్లకు చేరుకోగా, బంగారం గత జూన్ నుంచి గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలు స్వయం ప్రకటిత దేశాలుగా ప్రకటించుకున్నాయి. వాటిని గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ మంగళవారం తెలిపారు. దీంతో వరుసగా ఆరో రోజు మంగళవారం బిట్ కాయిన్ విలువ 36,372 డాలర్లు పలికింది. మున్ముందు 30వేల డాలర్లకు పడిపోతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మిగతా క్రిప్టో టోకెన్లలో ఏథేర్ 2.9 శాతం, ఎక్స్ఆర్పీ 6.7 శాతం పతనం అయ్యాయి.
ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడి పెట్టడానికి బదులు బంగారంపై మదుపు చేయడానికి మొగ్గుతున్నారని 22వీ రీసెర్చ్ ప్రతినిధి జాన్ రోగ్ తెలిపారు. అమెరికా-రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో బిట్‌కాయిన్ విలువ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతున్నదన్నారు. బంగారంతో పోలిస్తే రోజురోజుకు బలహీన పడుతున్నదన్నారు. బిట్ కాయిన్ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయే అవకాశం ఉందన్నారు. కానీ బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డుల దిశగా పరుగెడుతున్నదని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు క్రిప్టో కాయిన్స్, బంగారంల్లో ఏది బెస్ట్ అనే విషయాన్ని నిర్దేశించాయని నెక్సో కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్టనర్ అంటోనీ ట్రెంచెవ్ తెలిపారు. గత వేసవిలో బిట్ కాయిన్ 29 వేల డాలర్ల స్థాయికి పడిపోయింది. మరో అనలిస్్ ఫెయిర్ లీడ్ స్ట్రాటర్జీస్ ఫౌండర్ కైట్ స్టాక్టన్ స్పందిస్తూ బిట్ కాయిన్లో పెట్టుబడులు ఎంతమాత్రం సానుకూలం కాదన్నారు. సుదీర్ఘకాలం 37,400 డాలర్ల వద్ద స్థిరంగా సాగిన బిట్ కాయిన్ 27,200 డాలర్లకు పడిపోయివచ్చన్నారు.
కరోనా మహమ్మారి వేళ దూకుడుగా దూసుకెళ్లిన క్రిప్టో కరెన్సీలు.. వాటిల్లో క్రిప్టో మేజర్ బిట్ కాయిన్‌ను ఎలన్‌మస్క్ వంటి కార్పొరేట్లు, వీసా కార్డ్ వంటి ఫైనాన్సియల్ పేమెంట్స్ సంస్థలు ప్రోత్సహించాయి. డిజిటల్ గోల్డ్ అవతార్ అని ప్రకటించాయి. క్రెడిట్,డెబిట్ కార్డుల మాదిరిగా క్రిప్టో కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాయి. కానీ, ప్రపంచ దేశాలన్నీ కఠిన నియంత్రణ చర్యలు మొదలెట్టడంతో క్రిప్టో కరెన్సీలు ఒడిదొడుకులకు గురవడం ప్రారంభమైంది. బిట్ కాయిన్ గతేడాది చివర్లో ఆల్‌టైం రికార్డు ధర పలికినా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఉసూరోమంటున్నది.