CRISIL Report | ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కీలక డేటాను గురువారం విడుదల చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వంటిల్లుపై భారం పడుతున్నది. గతేడాదితో పోలిస్తే వ్యయం పెరిగినట్లు క్రిసిల్ డేటా వెల్లడించింది. ఇంటి శాఖాహార భోజనం మార్చిలో 7శాతం పెరిగి రూ.27.3 చేరిందని తెలిపింది. ఇదే సమయంలో గతేడాది ధర రూ.25.5గా ఉన్నది. ఇక మాంసహారం భోజనం ధర ఏడుశాతం తగ్గి రూ.54.9కి చేరగా.. గతేడాది రూ.59.2గా ఉండేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. వెజ్ భోజనంలో రోటీ, ఉల్లిపాయ, టొమాటో, బంగాళదుంప, అన్నం, పప్పు, పెరుగు, సలాడ్ ఉండగా.. మంసాహారం భోజనంలో ఇవే పదార్థాలుంటాయి.
పప్పు స్థానంలో మాంసం ఉంటుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భారతంలోని ధరల ఆధారంగా భోజనానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేస్తున్నది. క్రిసిల్ ‘రోటీ రైస్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో.. ఏడాది ప్రాతిపదికన ఉల్లిగడ్డలు 46శాతం, టమాటలు, 36, బంగాళదుంపలు 22శాతం పెరగడంతో వెజ్భోజనం ధర పెరిగింది. మార్కెట్లో ఉల్లి, బంగాళదుంపల కొరత ఏర్పడి గత ఆర్థిక సంవత్సరంలో టమాటా కొరత కారణంగా ధరలు భారీగా పెరిగాయి. దాంతో పాటు బియ్యం ధరలు 14 శాతం, పప్పులు 22 శాతం పెరిగాయి. మాంసం ధరలు 16శాతం పడిపోయినందున మార్చిలో భోజనానికి ఖర్చు తగ్గిందని నివేదిక తెలిపింది.
క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ పూషన్ శర్మ మాట్లాడుతూ.. ‘గత ఐదు నెలలుగా శాకాహార, మాంసాహార భోజనం ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుందన్నారు. మాంసహారంతో పోలిస్తే శాఖాహార భక్షజనం ధర పెరిగిందన్నారు. మాంసహారం ధరలు పడిపోవడమే వ్యత్యాసానికి కారణం. ముడి చమురు ధరలు ఐదుశాతం పెరగడంతో ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నాన్వెజ్ భోజనం ధర రెండుశాతం పెరిగింది. రంజాన్ మాసంలో మాంసాహారానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పశుగ్రాసం ధర పెరిగింది. రాబోయే కాలంలో తాజా పంట మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని.. గోధుమల ధరలు తగ్గుతాయని శర్మ అంచనా వేశారు. అయితే, రబీలో పంటల ఉత్పత్తి 20శాతం తగ్గుదల కనిపిస్తుందని.. ధర పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.