Banks | అప్పులో 73 శాతం గల్లంతే.. దివాలా కేసుల్లో నిండా మునుగుతున్న బ్యాంకులు
సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు తయారైంది దివాలా తీర్మాన కేసుల్లో బ్యాంకుల పరిస్థితి. ఇచ్చిన అప్పులు ఎంతకీ వసూలు కాకపోతుండటంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయిస్తున్న రుణదాతలకు దక్కుతున్నది అంతంతే మరి.
- లిటిగేషన్లతో పెరుగుతున్న పరిష్కార సమయం -ఇక్రా తాజా రిపోర్టులో వెల్లడి
ముంబై, మే 17: సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు తయారైంది దివాలా తీర్మాన కేసుల్లో బ్యాంకుల పరిస్థితి. ఇచ్చిన అప్పులు ఎంతకీ వసూలు కాకపోతుండటంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయిస్తున్న రుణదాతలకు దక్కుతున్నది అంతంతే మరి. దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2023-24) దివాలా ప్రక్రియ కేసుల్లో రుణదాతలు తామిచ్చిన అప్పులో ఏకంగా 73 శాతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)లోనూ ఇది 64 శాతంగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇంకా పెరుగడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) కూడా బ్యాంకుల రుణ రికవరీ సగటు 30-35 శాతం శ్రేణిలోనే ఉండవచ్చని ఇక్రా అంచనా వేస్తున్నది.
ఆందోళనకరం
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల మొండి బకాయి (నిరర్థక ఆస్తి లేదా ఎన్పీఏ)ల్లో ఎక్కువ శాతం కార్పొరేట్ రుణాలే ఉన్న విషయం తెలిసిందే. అయితే మొత్తం బకాయిల్లో మిగతా రుణాల కంటే ఈ కార్పొరేట్ రుణాల్లోనే బ్యాంకులుగానీ, ఇతర రుణదాతలుగానీ ఎక్కువగా నష్టపోవాల్సి వస్తున్నదని ఇక్రా చెప్తున్నది. ఇది ఆందోళనకర స్థాయిలోనే ఉంటుందని కూడా హెచ్చరించింది. ఇక ఎన్పీఏలను అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ)లకు చాలా అగ్గువకే బ్యాంకులు అమ్ముకుంటున్నాయని కూడా ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తునే నష్టాలు వస్తున్నాయని ఇక్రా సైతం పేర్కొంటున్నది.
చిక్కులతో..
దివాలా కేసుల్లో బ్యాంకర్లు అనేక రకాల లిటిగేషన్లను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఇక్రా నిర్మాణాత్మక ఫైనాన్స్ రేటింగ్స్ విభాగాధిపతి అభిషేక్ దఫ్రియా అంటున్నారు. అంతకుముందుతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం దివాలా తీర్మాన ప్రక్రియకు పట్టే సమయం పెరిగిందని, 834 రోజులవుతున్నదన్నారు. ఇది కూడా మొండి బకాయిల్లో ఎక్కువ మొత్తాన్ని రుణదాతలు వదులుకునేందుకు కారణమవుతున్నదనీ చెప్తున్నారు. నిజానికి 330 రోజుల్లోనే రిజల్యూషన్ పూర్తవ్వాలని చట్టాల్లో (ఐబీసీ) ఉందని ఆయన గుర్తుచేస్తున్నారు. ఇదిలావుంటే ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్సీఎల్టీ ఆమోదించిన రిజల్యూషన్ ప్లాన్లు మొత్తం 269గా ఉన్నాయి. ఏడాది కిందట 189 ఆమోదం పొందాయి. కాగా, 2023-24లో ఎన్సీఎల్టీకి వచ్చిన కొత్త కేసులు 987కు తగ్గాయి. 2022-23లో 1,263గా ఉన్నాయి. అయితే కరోనా ప్రభావం వల్లే నాడు ఎక్కువ కేసులు వచ్చినట్టు ఇక్రా చెప్తున్నది.
ప్రైవేటీకరణపై మాట్లాడలేం: జోషి
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం లేదా ప్రైవేటీకరణపై మాట్లాడలేమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషీ అన్నారు. సర్కారీ బ్యాంకుల ఏకీకరణ, అమ్మకాలపై మాట్లాడే సమయం ఇది కాదని శుక్రవారం అడిగిన ఓ ప్రశ్నకుగాను ఆయన సమాధానమిచ్చారు. ఇక మోదీ హయాంలో రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకుల విలీనం జరిగిన సంగతి విదితమే. 2020 ఏప్రిల్ 1న జరిగిన మెగా విలీనంలోనైతే ఏకంగా 10 బ్యాంకులు.. 4 బ్యాంకులుగా మారిపోయాయి. పీఎన్బీలో ఓరియంటల్, యునైటెడ్ బ్యాంక్ లు కలిసిపోగా, కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. యూ నియన్ బ్యాంక్‌లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకులు కలిసిపోయాయి. ఇండియన్ బ్యాంక్‌తో అలహాబాద్ బ్యాంక్ విలీనం జరిగింది. ఇక 2019 ఏప్రిల్ 1న బీవోబీలో విజయా, దేనా బ్యాంక్‌లు విలీనమైనది తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ARC
- bankruptcy cases
- banks
- FY24
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

