Credit Cards | గతంతో పోలిస్తే ఇప్పుడు క్రెడిట్ కార్డులు తేలిగ్గా లభిస్తున్నాయి. 2019 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకూ గత ఐదేండ్లలో కస్టమర్లు క్రెడిట్ కార్డులు తెగ తీసుకుంటున్నారు. ఐదేండ్లలో రెండింతలకు పైగా క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. అదే సమయంలో సేవింగ్స్ ఖాతాతో అనుసంధానమైన డెబిట్ కార్డులు మాత్రం స్థిరంగా ఉన్నాయని ఆర్బీఐ సోమవారం జారీ చేసిన నివేదికలో తెలిపింది. అదే సమయంలో గత దశాబ్ద కాలంలో డిజిటల్ చెల్లింపులు అసాధారణ రీతిలో వృద్ధి చెందాయని పేర్కొంది. 2019డిసెంబర్లో 5.53 క్రెడిట్ కార్డులు జారీ అయితే గతేడాది డిసెంబర్ వరకూ రెండింతలకు పైగా అంటే 10.80 కోట్ల క్రెడిట్ కార్డులు వాడకంలోకి వచ్చాయి. 2013 నుంచి గత దశాబ్ద కాలంలో రూ.772 లక్షల కోట్ల విలువైన 222 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2013తో పోలిస్తే 2024 నాటికి పరిమాణం రీత్యా 94 రెట్లు, విలువ రీత్యా 3.5 రెట్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. 2024లో 20,787 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగితే వాటి విలువ రూ.2,758 కోట్లు.
గత ఐదేండ్లలోనే డిజిటల్ లావాదేవీలు పరిమాణం రూపంలో 6.7 రెట్లు, విలువ రూపంలో 1.6 రెట్లు పెరిగాయి.2019 డిసెంబర్ నుంచి గతేడాది డిసెంబర్ వరకూ డెబిట్ కార్డులు స్వల్పంగా 80.53 కోట్ల నుంచి 99.09 కోట్లకు పెరిగాయి. 2012-13లో 162 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగితే, 2023-24లో 100 రెట్లు వృద్ధి చెంది 16,416 కోట్ల లావాదేవీలకు దూసుకెళ్లాయి. తొలుత దేశీయంగా అమలు చేసిన యూపీఐ లావాదేవీలు ఇప్పుడు భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లకు విస్తరించింది ఆర్బీఐ.