రివార్డులు, క్యాష్‌బ్యాక్, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు, ప్రయోజనాలతో క్రెడిట్ కార్డ్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే క్రెడిట్ కార్డ్ ఖర్చులు మితిమీరినా, మీరు ప్రకటించిన ఆదాయంతో సరితూగకపోయినా ఇబ్బందులేనన్నది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవే మీ ఆదాయ పన్ను (ఐటీ) నోటీసులకు కారణం కాగలవు. మరి ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు.
ఫండ్ రొటేషన్ కోసం క్రెడిట్ కార్డులను వినియోగించడాన్నే మాన్యుఫ్యాక్చర్డ్ స్పెండింగ్ అంటారు. రివార్డ్ పాయింట్లను గెల్చుకొనేందుకు స్నేహితులకు కార్డులివ్వడం ఈ కోవకు చెందినదే. అయితే ట్యాక్స్‌పేయర్ ప్రకటించిన ఆదాయాన్ని ఈ తరహా లావాదేవీలు పెంచుతాయని, అది ఐటీ నోటీసులకు దారితీయవచ్చని చార్టెడ్ అకౌంటెంట్లు చెప్తున్నారు.
తరచూ వ్యాలెట్ టాప్-అప్లు, అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఇతరత్రా చెల్లింపులకు దిగడం కూడా ఇబ్బందికరమే. అధికారులు మీ పేమెంట్ల వివరాలను ఆరా తీసినా, మీ నుంచి వివరణ కోరినా రిస్క్ తప్పదు.
స్నేహితులు, బంధువుల కోసం అద్దె చెల్లింపులు జరిపినా నోటీసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా కేసుల్లో నగదు మొత్తాలు రిఫండ్ అవుతూ ఉంటాయి. అయితే వీటిని సర్క్యులర్ లావాదేవీలుగా పరిగణిస్తారు.
రివార్డు పాయింట్లను ఆర్జించడానికి కంపెనీల నుంచి రీయింబర్స్మెంట్లను క్లెయిమ్ చేసుకోవడం, ఇతర వ్యాపార అవసరాల కోసం వ్యక్తిగత క్రెడిట్ కార్డులను వాడటం కూడా ప్రమాదమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి చర్యలకు చట్టపరంగా శిక్షార్హులు కాగలరు.
ఏదైనా కొన్నప్పుడు రెగ్యులర్‌గా వచ్చే క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లపై పన్నులు వర్తించవు. అయితే ఈ పాయింట్లను మీరు నగదుగా, రుణాల చెల్లింపులకు వాడితే మాత్రం పన్నులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక ఏటా ఈ రివార్డ్ పాయింట్ల విలువ రూ.50,000 దాటితే ఇతర వనరుల ద్వారా పొందిన ఆదాయంగా ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్)లో పేర్కొనాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేయకపోవడమే మంచిది. వ్యక్తిగత, వ్యాపార, థర్డ్-పార్టీ కేటగిరీలుగా అన్ని లావాదేవీలను నమోదయ్యేలా చూసుకోవడం ఉత్తమం. అప్పుడే ఐటీ అధికారులు అడిగినా లెక్కలు కచ్చితంగా చెప్పగలం.
ఇప్పటికీ మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫైనాన్సింగ్ ఆప్షన్ వ్యక్తిగత రుణమే. వైద్య ఖర్చులు, ప్రయాణాలు, అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి మెజారిటీ ప్రజలు వీటిపైనే ఆధారపడుతున్నారు మరి. అయితే వ్యక్తిగత రుణం తీసుకునే ముందు.. ఆ అప్పు ఈఎంఐని ప్రభావితం చేసే అంశాలు ఏంటో మీకు తెలుసా?
రుణ మొత్తం: తీసుకునే రుణం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత ఈఎంఐ భారం పెరుగుతుంది. కాబట్టి రుణం ఇస్తున్నారనో లేదా మీకు అర్హత ఉందనో అవసరానికి మించి అప్పు చేస్తే తిప్పలే. పెరిగే ఈఎంఐ చెల్లింపులు భారం కాగలవు.
వడ్డీరేటు: వ్యక్తిగత రుణాలతోపాటు అన్ని రుణాలపైనా వడ్డీరేట్లు.. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, రుణ చరిత్రల ఆధారంగానే ఉంటాయి. సాధారణంగా గోల్డ్ లోన్, హోమ్ లోన్లతో పోల్చితే పర్సనల్ లోన్లపై ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువే. కాబట్టి మీ క్రెడిట్ ప్రొఫైల్ బాగుండేలా చూసుకోండి. 750ని మించి మీ క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీరేటు ఆఫర్ ఉంటుంది.
కాలవ్యవధి: రుణ కాలవ్యవధి కూడా ప్రధానమే. ఈఎంఐ తగ్గుతున్నదికదా అని చాలామంది లోన్ టెన్యూర్‌ను పెంచేసుకుంటారు. కానీ దీనివల్ల మీరు తీసుకునే రుణంపై వడ్డీ రూపంలో ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కనుక కాలవ్యవధి తక్కువగా పెట్టుకుంటే ఈఎంఐ పెరిగినా.. అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు.
స్థిరమైన ఆదాయం: స్థిరమైన ఆదాయాన్ని మెయింటేన్ చేయడం కూడా ముఖ్యమే. తరచూ రుణాలు తీసుకుంటుంటే మీకు అవసరాలు ఎక్కువ, ఆదాయం తక్కువని రుణదాత (బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు)లు భావించే ప్రమాదం ఉన్నది. అనవసరపు ఖర్చులు తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టండి. దీనివల్ల బ్యాంకర్లు పిలిచిమరీ రుణాలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా హోమ్ లోన్ వంటివి తీసుకునేటప్పుడు మీకున్న క్రమశిక్షణ కలిసిరాగలదు.
ప్రాసెసింగ్ ఫీజులు: ప్రాసెసింగ్ ఫీజులు, అదనపు చార్జీలపైనా రుణగ్రహీతలకు అవగాహన ఉండాలి. మీ ఈఎంఐని ఇవి ప్రభావితం చేయకపోయినప్పటికీ.. ఆయా సంస్థలనుబట్టి ఈ ఫీజులుంటాయి. కనుక ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడ లోన్ కోసం ప్రయత్నించండి. వడ్డీరేట్లు ఎంత? అన్నది కూడా చూసుకోవడం మరువద్దు.