Cibil Score Benefits | ప్రస్తుతం ఆర్థిక లావాదేవీల్లో క్రెడిట్ కార్డులు ప్రధానమయ్యాయి. ప్రతియేటా చాలా మంది కొత్తగా క్రెడిట్‌కార్డులు తీసుకుంటూనే ఉన్నారు. కొత్తగా రమారమీ 80 లక్షల మంది క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారని అంచనా. 2020-21 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 6.2 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. అయితే, క్రెడిట్ కార్డుల వాడకం పట్ల అవగాహన లేకపోతే ఇబ్బందుల్లో పడతారని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పద్దతి ప్రకారం క్రెడిట్ కార్డులు వాడకపోతే అధిక వడ్డీ, ఫైన్ చెల్లించడంతోపాటు వాటి వల్ల వచ్చే బెనిఫిట్లను కూడా కోల్పోతారు. క్రెడిట్ స్కోర్ పడిపోతూ ఉంటుంది. క్రమశిక్షణతో క్రెడిట్ కార్డులను వినియోగించడం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు పర్సనల్ డేటా అప్డేట్ చేయించుకోవాలి. ఒక్కోసారి పేరు నమోదు చేసుకోవడంలో పొరపాట్లు జరుగుతుంటాయి. ఔట్‌డేటెడ్ ఫోన్ నంబర్ రికార్డై ఉండొచ్చు. అటువంటి వాటిని సరి చేసుకోవాలి.
క్రెడిట్ కార్డులతోపాటు ప్రతి ఒక్కరూ తీసుకునే వివిధ రుణాలు, వాటి చెల్లింపులను బట్టి వారి క్రెడిట్ (సిబిల్) స్కోర్ ఖరారవుతూ ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ ప్రతి ఒక్కరి ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో దాన్ని బట్టి మీ ఆర్థిక క్రమశిక్షణ, హోదా ఖరారవుతూ ఉంటుంది. ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి రుణ పరపతి కల్పించడానికి బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తుంటాయి. వడ్డీరేటు తగ్గింపు కోసం బేరసారాలు చేయొచ్చు. అధిక రుణం కోసం సంప్రదింపులు జరుపొచ్చు. కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇప్పటికే వాడుతున్న క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవచ్చు. రుణాలపై ప్రాసెసింగ్ చార్జీల్లో రాయితీలు, దీర్ఘకాలిక టెన్యూర్ గల రుణాలు పొందే అవకాశాలు మెరుగవుతాయి.
ఇండ్లూ వాహనాల కొనుగోలు, వ్యక్తిగత-వ్యాపార అవసరాల కోసం ఒక్కోసారి రుణం తీసుకోవాల్సి రావచ్చు. అలా రుణం కోసం ప్రయత్నించినప్పుడల్లా బ్యాంకులు రుణ దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్ ఎంక్వైరీ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్, పాత రుణాల చెల్లింపు చరిత్ర, చెక్ బౌన్స్ ఘటనలు అన్నీ ఆరా తీస్తాయి. ఆయా వ్యక్తుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందుకోసం క్రెడిట్ బ్యూరోల సహాయ, సహకారాలు తీసుకుంటాయి. అంతా బాగుందని రూడీ చేసుకున్నాకే రుణం మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటాయి బ్యాంకులూ ఆర్థిక సంస్థలు.
మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే కొత్తగా క్రెడిట్ కార్డులు పొందొచ్చు. తక్కువ వడ్డీపై రుణం పొందొచ్చు.ఎక్కువ రుణం పొందొచ్చు. అలా కాకుండా సిబిల్ స్కోర్ తక్కువగా.. పేలవంగా ఉంటే రుణ పరపతి లభించే అవకాశమే తక్కువ. ఒకవేళ లోన్ వచ్చినా ఎక్కువ వడ్డీ ఖరారవుతుంది. దరఖాస్తులో పేర్కొన్నదానికంటే తక్కువ లోన్ రావచ్చు. మరీ తక్కువ సిబిల్ స్కోర్ ఉంటే ఒక్కోసారి రుణమే మంజూరు కాకపోవచ్చు.
కనుక క్రెడిట్ స్కోర్ తగ్గకుండా.. మరీ పేలవంగా నమోదు కాకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు రుణ వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. ఫోన్, విద్యుత్, ఇతర యుటిలిటీ చార్జీలు టైం లోపల పే చేస్తుండాలి. ఇతరులకు చెక్‌లు జారీ చేస్తే.. అందుకు తగిన మొత్తం నిధులు సదరు ఖాతాలో నిల్వ ఉంచాలి. పేమెంట్స్‌లో డిఫాల్ట్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు హితవు చెబుతున్నారు.
ఒకేసారి ఎక్కువ రుణాల కోసం అప్లికేషన్లు పెట్టొద్దు. ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ చరిత్రలో తప్పులు, పొరపాట్లు ప్రతినిత్యం తనిఖీ చేస్తూ సరి చేసుకుంటూ ఉండాల్సిందే. సిబిల్ స్కోర్‌ను మెరుగు పర్చుకునేందుకు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.