Credit Card | ఆరు నెలల తర్వాత తొలిసారి నవంబర్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం పడిపోయింది. జూలైలో ఓనంతో మొదలైన ఫెస్టివ్ సీజన్ ముగింపునకు సంకేతం అని భావిస్తున్నారు. అక్టోబర్ నెలతో పోలిస్తే 12 శాతానికి పైగా క్రెడిట్ కార్డు వినియోగం తగ్గిపోయిందని ఆర్బీఐ డేటా పేర్కొంది. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుపై సగటున రూ.16,343 ఖర్చు చేస్తే, నవంబర్‌లో అది రూ.14,280కి పడిపోయింది. అయితే, వరుసగా తొమ్మిదో నెల నవంబర్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటింది.
అక్టోబర్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై క్రెడిట్ కార్డుతో సగటున రూ.9473 ఖర్చు చేస్తే, నవంబర్‌లో రూ.8495కు దిగి వచ్చింది. అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుపై 3.2 లావాదేవీలు నమోదైతే, సెప్టెంబర్‌లో 2.9 లావాదేవీలుగా రికార్డయ్యాయి. జూన్‌లో క్రెడిట్ కార్డులపై సగటున రూ.13,857 ఖర్చు చేస్తే, జూలైలో రూ.14,478 వినియోగించారు.
ఫెస్టివ్ సీజన్ ముగియడంతోపాటు అధిక ధరల ప్రభావంతో క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గుముఖం పట్టిందని ఐడీబీఐ క్యాపిటల్ అనలిస్ట్ బంటీ చావ్లా చెప్పారు. అయితే, రాబోయే నెలల్లో క్రెడిట్ కార్డు వినియోగం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.