Credit Card | ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వాడటం సర్వ సాధారణంగా మారింది. అయితే, తమ ఆదాయ పరిమితికి లోబడి క్రెడిట్ కార్డు వాడుకున్నంత వరకు నో ప్రాబ్లం. బ్యాంకులు గతంలో ఖాతాదారుల ఆదాయాన్ని బట్టి క్రెడిట్ కార్డులు జారీ చేసేవి. ఆయా ఖాతాదారుల నెలవారీ ఆదాయం.. వేతనం వారి చెల్లింపు స్థోమత ఎంతో చెబుతుంది. ఆర్థిక పరమైన అంశాల్లో ఎంత బాధ్యతగా ఉంటారో క్రెడిట్ చరిత్ర వెల్లడిస్తుంది. కనుక నెల వారీగా.. ఖచ్చితమైన ఆదాయం లేకుండా బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేసే రిస్క్‌కు సిద్ధ పడవు. ప్రతి ఒక్కరికీ క్రెడిట్ కార్డు జారీ చేయాలని బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు భావిస్తాయి. కానీ.. క్రెడిట్ కార్డు వాడుకున్నా.. వారికి సదరు బిల్లు చెల్లింపు స్థోమత లేకపోతే రిస్క్‌లోకి వెళ్లవు. అటువంటి రిస్క్‌లతో బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థల వ్యాపారం దెబ్బ తింటుంది. కనుక క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి స్థితిగతులను పూర్తిగా చెక్ చేశాకే జారీ చేస్తాయి.
ఆదాయ వనరులేకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావించే వారిలో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగా చూపుతారు. ఫిక్స్డ్ డిపాజిట్ తనఖా పెట్టి క్రెడిట్ కార్డు తీసుకుంటారు. దీన్ని సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు అని కూడా అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తంలో 75-90 శాతం వరకు క్రెడిట్ కార్డుతో వాడుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే మ్యూచువల్ ఫండ్స్ చూపి క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఒకవేళ బిల్లు ఎగవేతకు పాల్పడితే, మ్యూచువల్ ఫండ్స్ నుంచి బ్యాంకులు ఆ బకాయి వసూలు చేసుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఆధారిత క్రెడిట్ కార్డు కూడా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు కిందకే వస్తుంది.
ఇప్పుడు విద్యార్థులకు కూడా కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నాయి. అయితే తక్కువ క్రెడిట్ పరిమితి ఇస్తాయి. ప్రత్యేకించి విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం ఏదైనా ఒకటి తనఖా పెట్టాలి.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్న రుజువులు చూపాలి.. ఫిక్స్డ్ డిపాజిట్.. సేవింగ్స్ అకౌంట్ చూపి తీసుకోవాలి. జనరల్ క్రెడిట్ కార్డుల మాదిరిగా స్టూడెంట్ క్రెడిట్ కార్డులకు అన్ని రకాల వెసులుబాట్లు ఉండవు. అడ్మిషన్ ఫీజు, ప్రతియేటా చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజు వంటి వాటికి మాత్రమే స్టూడెంట్ క్రెడిట్ కార్డు ఉపయోగించుకోవచ్చు.
వివిధ బ్యాంకుల ఖాతాదారుల బ్యాంకు బ్యాలెన్స్ బేస్‌గా చేసుకుని కొన్ని ఆర్థిక సంస్థలు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. అందుకు బ్యాంకులో తగినంత నిధులు నిల్వ ఉన్నాయని ఆధారాలు సమర్పించాలి. భారీగా ట్రాన్సాక్షన్స్ జరుపుతూ నిత్యం ఖాతాలో జమ్ము డిపాజిట్ అవుతుందని చూపగలగాలి. క్రెడిట్ లేదా డెట్ నిష్పత్తి సరిగ్గా ఉండాలి. అప్పుడే క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించడానికి అవసరమైన డబ్బు ఉంటుందని సంబంధిత క్రెడిట్ కార్డు సంస్థలు విశ్వసిస్తాయి.
ఇప్పటికే ఒక బ్యాంకు లేదా ఒక సంస్థ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే, దాని ఆధారంగా ఇతర బ్యాంకులు, సంస్థలు యాడ్-ఆన్ కార్డు జారీ చేస్తాయి. దీనికి ఎలాంటి ఇన్‌కం డాక్యుమెంట్స్ సమర్పించనవసరం లేదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు క్రెడిట్ కార్డు కలిగి ఉండి.. వారి క్రెడిట్ చరిత్ర చక్కగా ఉందనుకోండి. మరొకరి కోసం యాడ్ ఆన్ కార్డు తీసుకునే ఫెసిలిటీ ఉంది. బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్ మాదిరే జాయింట్ క్రెడిట్ కార్డు పొందొచ్చు. క్రెడిట్ కార్డు జారీ చేయడానికి కో-అప్లికెంట్ సరైన ఇన్‌కం డాక్యుమెంట్స్ సమర్పిస్తే సరి. ఆ వ్యక్తి స్థోమత ఆధారంగా జాయింట్ క్రెడిట్ కార్డు జారీ చేస్తాయి బ్యాంకులు.