Cars Crash Testing | దేశీయ ఆటోమొబైల్ సంస్థలు తయారు చేసే కార్లలో సేఫ్టీ ప్రమాణాలను పరీక్షించడానికి కేంద్రం నిబంధనలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా భారత్ ఎన్-క్యాప్ (Bharat NCAP/BNCAP – Bharat New Car Assesment Programme) పేరుతో కార్ల సేఫ్టీ ప్రమాణాలకు రేటింగ్ ఇవ్వనున్నది.
ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి భారత్ ఎన్-క్యాప్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ రేటింగ్ విధానం గత ఏప్రిల్ నుంచే అమలు చేయాలనుకున్నా, విధి విధానాల ఖరారులో జాప్యం వల్ల ఆలస్యమైంది.
భారత్ ఎన్-క్యాప్ ప్రమాణాలను పరీక్షించి రేటింగ్ ఇవ్వడానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుంది. భారత్ మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లను క్రాష్ టెస్టింగ్ చేసిన తర్వాత వాటికి రేటింగ్ ఇస్తుంది. ఇందుకోసం ఆయా కార్లను క్రాష్ టెస్ట్ చేసి.. వాటి ఫలితాల ఆధారంగా.. వాటిల్లో భద్రతా ప్రమాణాలపై కేంద్రం స్టార్ రేటింగ్ ఇస్తుంది.
ఇంతకుముందు భారత్లో తయారయ్యే కార్లు, విదేశాల్లో తయారై భారత్కు దిగుమతయ్యే కార్లకు గ్లోబల్ ఎన్-క్యాప్, యూరో ఎన్-క్యాప్, సంస్థలు స్టార్ రేటింగ్ ఇస్తున్నాయి. దేశీయంగా తయారైన కార్లను విదేశాలకు తీసుకెళ్లడం వల్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దేశీయంగా క్రాష్ టెస్టింగ్ చేయడం వల్ల ఆటోమొబైల్ సంస్థలకు ఖర్చుతోపాటు సమయం ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.