న్యూఢిల్లీ: జూలై నెలాఖరు నాటికి గానీ, ఆగస్టులో గానీ 12-18 ఏండ్లలోపు పిల్లలకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నదని కేంద్రం ఆదివారం తెలిపింది. 18 ఏండ్ల లోపు పిల్లలపై ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిల్లా చేపట్టిన కరోనా టీకా ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయని కోవిడ్‌పై ఏర్పాటైన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు.
జైడస్ క్యాడిల్లా అభివ్రుద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర అవసరాలకు వినియోగించేందుకు నియంత్రణ సంస్థల అనుమతులు రావాల్సి ఉందని శనివారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉంటే తాను అభివ్రుద్ధి చేసిన వ్యాక్సిన్.. జైకోవ్-డీ.. వినియోగానికి అనుమతించాలని జైడస్ క్యాడిల్లా త్వరలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేయనున్నది. జై కోవ్-డీ టీకాను పిల్లలు, పెద్దలకూ ఇవ్వవచ్చు.
ఇప్పటికైతే 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్‌కు అర్హులే. మొత్తం దేశ జనాభాకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగియడానికి ఎనిమిది నెలలు పట్టొచ్చుననని భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్) అధ్యయనం పేర్కొంది.
ప్రస్తుతం పలు దేశాలు చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నాయి. జైడస్ క్యాడిలా వారి జైకోవ్-డీ వ్యాక్సిన్‌కు అనుమతులు లభిస్తే, అది ఒక ఆప్షన్‌గా మారుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
మనదేశంలో పిల్లలకు టీకా అందుబాటులోకి వస్తే అదో మైలురాయి అవుతుందన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ వల్ల పాఠశాలలు, విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఉపకరిస్తుందన్నారు. విద్యార్థుల చదువులకు మార్గం సుగమం అవుతుందని గులేరియా అన్నారు.
జైడస్ క్యాడిల్లాతోపాటు 2-18 ఏండ్ల మధ్య వయస్సు గల వారికి టీకా కోసం భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రెండో, మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. ఈ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావచ్చునని భావిస్తున్నారు.
పిల్లలకు టీకా వేసేందుకు ఫైజర్‌కూ అనుమతి వస్తే అదొక ఆప్షన్‌గా ఉంటుందని గులేరియా అన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్లతో వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్త్రుతం అవుతుందన్నారు.