హైదరాబాద్, డిసెంబర్ 17: ప్రముఖ ఎరువులు తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..డ్రోన్ ద్వారా పిచికారీ సేవలను మరిన్ని రాష్ర్టాలకు విస్తరించడానికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు చెందిన కృష్-ఈ తో జట్టుకట్టింది. వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా రైతులు డ్రోన్ ద్వారా పురుగుల మందు పిచికారీ చేసుకోవడానికి వీలుపడనున్నది. ప్రస్తుతం ఈ సేవలు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి అమీర్ అల్వీ తెలిపారు.
కవాసాకి బైకులపై భారీ రాయితీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ద్విచక్ర వాహన సంస్థ కవాసాకి.. ఇయర్ ఎండ్ రాయితీలు ప్రకటించింది. ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద గరిష్ఠంగా రూ.45 వేల వరకు రాయితీ ఇస్తున్నది. ఈ ఆఫర్లు ఎంపిక చేసిన జెడ్900, నింజా 650, వెర్సీ 650, నింజా 500, నింజా 300 మాడళ్లకు వర్తించనున్నదని పేర్కొంది. ఈ నెల చివరి వరకు ఉన్న స్టాక్స్ మాత్రమే ఈ రాయితీ ఉంటుందని తెలిపింది. ఇతర పోటీ సంస్థలకు చెందిన వాహనాల కంటే కంపెనీ బైకుల ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని గ్రహించిన సంస్థ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.