న్యూఢిల్లీ, జూలై 11: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఒకప్పుడు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించిన దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ సంస్థలు ప్రస్తుతం వీటికి స్వస్తి పలికేయోచనలో ఉన్నాయి. సీజనల్ సేల్ ముగియడం, మరోవైపు నిర్వహణ ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న పలు రిటైల్ దిగ్గజాలు వీటికి ముగింపు పలికాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ విక్రయ సంస్థలు గరిష్ఠ రిటైల్ విక్రయ ధరపై ఇచ్చే డిస్కౌంట్లు ఎత్తివేయడంతోపాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, కార్డ్-ఆధారిత ప్రమోషన్లను 5-7 శాతం వరకు తగ్గించాయని మార్కెట్ ట్రాకర్ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది.
నిర్వహణ ఖర్చులు పెరగడంతోపాటు ఉద్యోగుల కోసం అదనంగా నిధులు వెచ్చించాల్సిరావడం, మరోవైపు ముడి సరుకుల ధరలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో గతేడాదితో పోలిస్తే కన్జ్యూమర్ గూడ్స్ తయారీ సంస్థలు, రిటైలర్లు తమ ఉత్పత్తుల ధరల్లో ఇచ్చే డిస్కౌంట్లను 5-10 శాతం వరకు కోత పెట్టాయని తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లకు కూడా వర్తించనున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి భారీగా రాయితీలు ఇచ్చిన ఉత్పత్తి సంస్థలు ప్రస్తుతం వెనుకంజ వేస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాయితీలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతున్నదని, ఇదే సమయంలో లైఫ్‌ైస్టెల్ ఇంటర్నేషనల్, వీ-మార్ట్ రిటైల్, వుడ్‌ల్యాండ్ సంస్థలకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా ఆఫర్లకు గుడ్‌బై పలుకుతున్నాయని వుడ్‌ల్యాండ్ రిటైలర్ ఎండీ హర్కిరాత్ సింగ్ తెలిపారు. దీంతో తమ ఉత్పత్తులపై రాయితీలను 40 శాతం వరకు ఎత్తివేసినట్టు, కేవలం ఎంపిక చేసిన ఉత్పత్తులపై మాత్రమే 40 శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఆఫర్లు కూడా త్వరలో ముగియనున్నాయన్నారు. రాయితీలు అధికంగా ఇవ్వడంతో ఈసారి ఇన్వెంటరీ 60 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గాయని చెప్పారు.
గడిచిన ఏడాదికాలంలో కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమన్నాయి. దీంతో వుడ్‌ల్యాండ్ తమ ఉత్పత్తుల ధరలను 5-10 శాతం వరకు సవరించింది. మెమొరీ చిప్‌ల ధరలు రెండు నుంచి మూడింతలు పెరగడంతో గడిచిన ఆరు నెలల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్ ధరలు 30 శాతం నుంచి 40 శాతం వరకు అధికమయ్యాయి. వీటితోపాటు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీలు కూడా 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయి. వచ్చే నెలలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే రాయితీలు ఈసారి ఉండకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఎలక్ట్రానిక్ రిటైల్ సంస్థ విజయ సేల్స్ అన్ని రకాల బ్రాండ్లపై ఇచ్చే క్యాష్‌బ్యాక్‌లను భారీగా తగ్గించింది. బాటా ఇండియాతోపాటు వీ-మార్ట్ రిటైల్ కూడా సరాసరి ధరల్లో భారీ మార్పులు చేసింది.