Consumer Durables | వేసవిలో కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీల అమ్మకాలు పెరుగుతున్నాయి. గతేడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయి. ఈ సంవత్సరం సైతం వేడి పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దాంతో ఈ ఏడాది ఏసీలు 30 నుంచి35 శాతం, కూలర్లు 10శాతం, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పది నుంచి 15శాతం వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. దాంతో కూడా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గత సంవత్సరం లాగే.. ఈ ఏడాది వేసవికాలంలో వేడిగా ఉంటుందని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్, ఈవీపీ కమల్ నంది తెలిపారు. ఈ క్రమంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ పెరుగుతోన్నది. వేసవిలో ముఖ్యంగా ఏసీలకు డిమాండ్ ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా.. అన్ని తరగతుల్లోనూ పెరుగుతున్నది. ఏసీ పరిశ్రమ 30 నుంచి 35శాతం, రిఫ్రిజిరేటర్లలో 10 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. రాబోయే వేసవి కాలంలో ఏసీ అమ్మకాలలో 50 నుంచి 70 శాతం వాల్యూమ్ వృద్ధిని, రిఫ్రిజిరేటర్లలో 25 నుంచి 30 శాతం వాల్యూమ్ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హైయర్ అప్లయెన్స్ ఇండియా అధ్యక్షుడు ఎన్ఎస్ సతీశ్ పేర్కొన్నారు. వేసవిలో ఉష్ణోగత్రలు గరిష్ఠ స్థాయిలో ఉండడంతో శతలీకరణ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందన్నారు. వినియోగదారులు సమర్థవంతమైన, స్మార్ట్, అనుకూలమైన, అధిక నాణ్యత గల ఉత్పత్తులను డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6 శాతం తగ్గిందని కమల్ నంది తెలిపారు. దిగుమతి చేసుకుంటున్న ముడి సరుకు, దేశీయ మార్కెట్ నుంచి సేకరించిన వస్తువుల ధర పెరుగుదల కారణంగా ఇన్పుట్ ఖర్చు పెరిగిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీల ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఈ సారి పరిశ్రమ ఏసీ భాగాలు, కాంప్రెసర్ల రవాణాలో జాప్యం జరిగే అవకాశం ఉందని.. దాని కారణంగా ఏసీ ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వడం, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో డిమాండ్ పెరిగే అవకాశం ఉందని సతీశ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మన్నికైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ఆర్బీఐ రెండోసారి వడ్డీ రేట్లను తగ్గించడం, ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడం డిమాండ్ పెంచేందుకు సహాయపడుతుందని కేర్ ఏజ్ రేటింగ్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ డిమాండ్‌లో మందగమనం ఉందని.. వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉండడం, రాబోయే సీజన్లో రుతుపవనాల సీజన్లో వర్షాపాతం సాధారణంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.