హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఫోర్త్ సిటీలో నిర్మించ తలపెట్టిన ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సిటీని ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైసియా మంగళవారం నిర్వహించిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశీయ ఐటీ ఎగుమతుల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, కొత్త టెక్నాలజీలకు అధిక ప్రాధాన్యమిస్తూ యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తామని తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్నదని, దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నదని, అందులో భాగంగానే ఫోర్త్ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని 200 నిర్మించనున్నామని వివరించారు.
సెప్టెంబర్ 5-6 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో 2 వేల మందికిపైగా ఏఐ నిపుణులు పాల్గొంటారని, తెలంగాణకు గర్వకారణంగా నిలిచేలా ఈ సదస్సును నిర్వహించనున్నామని శ్రీధర్‌బాబు చెప్పారు. మరోవైపు, 10 వేల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టు హైసియా అధ్యక్షుడు ఎన్ ప్రశాంత్ వెల్లడించారు.