Actor Vijay | దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ చిక్కుల్లో పడ్డారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారంటూ ఫిర్యాదు చేశారు. ఇటీవల విజయ్ చెన్నైలోని రాయపేట వైఎంసీఏ మైదానంలో గ్రాండ్‌గా ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. అయితే, పలువురు దీన్ని ప్రశంసించగా.. తాజాగా వివాదం చెలరేగింది. తమిళనాడుకు చెందిన సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్.. ముస్లిం సమాజం మనోభావాలను అగౌరవపరిచారని ఆరోపించారు. ఇఫ్తార్ విందు సరిగా నిర్వహించలేదని విమర్శించారు. ఇఫ్తార్ నిజమైన స్ఫూర్తిని కొనసాగించడంలో విఫలమయ్యారని.. ఇఫ్తార్ విందు అసలు ఉద్దేశ్యానికి వ్యతిరేకంగా నిర్వహించారన్నారు.
కార్యక్రమానికి సంబంధం లేని వ్యక్తులు.. తాగుబోతులు, రౌడీలు హాజరయ్యారని ఇది సమాజాన్ని అవమానించడమేనన్నారు. విజయ్ గార్డులు అక్కడున్న వారిని అగౌరవంగా చూశారని.. ఈ క్రమంలో విజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు అడ్డుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై నటుడు విజయ్ స్పందించలేదు. రంజాన్ మాసం సందర్భంగా నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. విందులో తెల్లని డ్రెస్ ధరించి.. తలపై టోపీతో పాటు ముస్లింలతో నమాజ్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.