న్యూఢిల్లీ, జనవరి 4: సామాన్యులకు రిజర్వుబ్యాంక్ గట్టిషాకిచ్చింది. ఒకేసారి పలు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునేవారికి సెంట్రల్ బ్యాంక్ పరిమితులు విధించింది. బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తుండటంపై గతంలో ఆందోళన వ్యక్తంచేసిన సెంట్రల్ బ్యాంక్..వీరికి ముకుతాడువేయడానికి ఏకంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో ఈ నూతన సంవత్సరంలో తక్కువ వ్యవధిలో పలు బ్యాంకుల్లో ఎక్కువ సంఖ్యల్లో రుణాలు తీసుకోవడం ఇక కుదరకపోవచ్చు. ఈ నూతన నిబంధనలతో ఒకేసారి పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం అంత సులభం కాదు. పలువురు ఖాతాదారులు తమ సంపాదనకు మించి రుణాలు తీసుకుంటున్నారని, తిరిగి చెల్లింపులు జరపడంలో విఫలంకావడంతో బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరగడానికి ఇవే కారణమని గుర్తించిన ఆర్బీఐ, వీటికి చెక్ పెడుతూ నూతన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది.
ఇదీ సంగతి
బ్యాంకులు తమ రుణ రికార్డులను ప్రతి పదిహేను రోజులకోసారి నివేదించాల్సి ఉండటమే ఇందుకు కారణం. గతంలో ఈ గడువు నెలరోజులుగా ఉండేది. రికార్డులు తరుచూ అప్డేట్ అవుతుండటం వల్ల రుణాలు తీసుకునేవారి విషయంలో ఎక్కువ తనిఖీలు జరిగే అవకాశాలుంటాయి. తద్వారా ఒకేసారి పలుచోట్ల రుణాలు తీసుకునేందుకు అవకాశం లేకపోవచ్చు. వ్యక్తిగత రుణాలు తీసుకొని ఎగ్గొట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో బ్యాంకులను ఇప్పటికే హెచ్చరించిన ఆర్బీఐ..ఈ రుణాల మంజూరుకు చెక్‌పెట్టింది. గతేడాది ఆగస్టులోనే ఈ మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ, జనవరి 1, 2025 నుంచి అమలులోకి తేవాలని స్పష్టంచేసింది. ప్రస్తుతం ఈ కఠిన నిబంధనలు అమలులోకి రావడంతో రుణాలు తీసుకోవడం కష్టతరంకానున్నది. వేరువేరు రుణాలకు సంబంధించి ఈఎంఐలు, ప్రతినెలలో వేర్వేరు తేదీల్లో చెల్లింపులు జరుపుతుంటారు..నెల రోజులకోసారి ఆర్థిక సంస్థలు తమ రుణ సమచారాన్ని వెల్లడించడం వల్ల, బకాయిలు తిరిగి చెల్లింపులు లేదా ఎగవేతల సమాచారాన్ని అందించడానికి 40 రోజుల వరకు సమయం అవుతున్నది…ఈ నూతన మార్గదర్శకాలతో 15 రోజుల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉండటంతో ఈ ఆలస్యాలు భారీగా తగ్గనున్నాయని విశ్లేషకులు వెల్లడించారు. పలు బ్యాంకులు రుణాల మంజూరుపై ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి గతంలోనే ఆందోళన వ్యక్తంచేశారు. సెంట్రల్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో రుణాల తీసుకోకుండా అడ్డుకట్టవేయవచ్చునని చెప్పారు.