హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి ఈ సెప్టెంబర్ చివరికల్లా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. నైనీకి 50 కిలోమీటర్ల దూరంలోనే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని కూడా సంస్థ నిర్మించనున్నది. ఈ థర్మల్ప్లాంట్ నిర్మాణానికి అనువైన స్థలంతోపాటు కీలకమైన భూసేకరణ సమస్యను పరిష్కరించేందుకు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం సోమవారం ఒడిశాలో పర్యటించారు.
ఈ సందర్భంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్జెనాతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నైనీ కోల్బ్లాక్కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయని, రెండో దశ అటవీ అనుమతులకోసం నిబంధనలను పాటిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగానే రూ.180 కోట్లు చెల్లించామని, వన్యప్రాణి నిర్వహణ ప్రణాళికలో భాగంగా మరో రూ. 39 కోట్లు డిపాజిట్ చేశామన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభంకోసం 783 హెక్టార్ట అటవీభూమిని తమకు బదలాయించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నైనీ బొగ్గు గని నుంచి ఉత్పత్తికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఒడిశా సీఎస్ హామీనిచ్చారు.