Co-Operative | దేశంలోని అర్బన్ కో- ఆపరేటివ్ బ్యాంకుల (Co-Operative Banking Sector) మొత్తం పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ మార్చి 2025 నాటికి రూ.2.9 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2020తో పోలిస్తే గత ఐదేళ్లలో 1.8 రెట్లు పెరిగింది. ఈ సమాచారం నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NUCFDC) అండ్ ట్రాన్స్యూనియన్ సిబిల్ (CIBIL) నివేదిక పేర్కొంది. బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో పెరగడానికి ప్రధాన కారణం అనేక ఉత్పత్తి వర్గాల్లో రెండంకెల వృద్ధి అలాగే రుణాలకు డిమాండ్ పెరగడం, విస్తృత మార్కెట్లకు ప్రాప్యత అని పేర్కొంది. దేశంలో డిజిటలైజేషన్ కారణంగా ఈ బ్యాంకుల పనితీరులో సైతం మార్పులు వచ్చాయి. సాంకేతికత ఆధారిత మార్పుల కారణంగా కొత్త కస్టమర్స్ సైతం బ్యాంకుల్లో చేరుతున్నారు.
నివేదిక ప్రకారం.. భారత్లోని 1,472 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ బ్యాంకులు ముఖ్యంగా చిన్న పట్టణాలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో విస్తృత సేవలు అందిస్తున్నాయి. 2030 వరకు బ్యాంకింగ్ రంగం ప్రతి సంవత్సరం 11.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో భారతదేశ సమగ్ర అభివృద్ధి లక్ష్యాల్లో పట్టణ సహకార బ్యాంకులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థపై లోతైన పట్టు, బలమైన సంబంధాలతో ఈ బ్యాంకులను రుణగ్రహీతలకు అధికారిక రుణాన్ని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నివేదిక చెబుతున్నది. నివేదిక ప్రకారం, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు దాదాపు 9 కోట్ల మంది భారతీయులకు తమ సేవలను అందిస్తున్నాయి.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే వేగంలో అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా ఇందులో ముఖ్యమైన భూమికను పోషించనున్నాయి. స్వయం ఉపాధి పొందుతున్న యువత, మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు, అసంఘటిత రంగ కార్మికులు, తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే ప్రతి భారతీయుడికి సాధికారత కల్పించడంలో సహకార బ్యాంకులు ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం.. పట్టణ సహకార బ్యాంకుల వార్షిక రుణ పంపిణీ వృద్ధి రేటు మార్చి 2025 నాటికి 7.4 శాతానికి చేరుకుంది. షెడ్యూల్డ్ అండ్ నాన్-షెడ్యూల్డ్ పట్టణ సహకార బ్యాంకులు రుణ కార్యకలాపాలను పెంచడంలో పాత్ర పోషిస్తున్నాయి.