ముంబై, ఫిబ్రవరి 4: వచ్చే 20-30 ఏండ్లలో 25 నుంచి 30 లక్షల కోట్ల డాలర్లకు చేరే సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నదని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) సీఎండీ ముకేశ్ అంబానీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమయంలో దేశీయ యువతరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు వస్తాయని కూడా అన్నారు. బుధవారం ఇక్కడ ‘నవ శకం కోసం పెట్టుబడి’ పేరిట జియో-బ్లాక్‌రాక్ సంస్థలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ ఫైర్‌సైడ్ చాట్‌లో జియో తరఫున ముకేశ్ అంబానీ.. అమెరికా బహుళజాతి పెట్టుబడుల నిర్వహణ సంస్థ బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్ ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగానే ముకేశ్ మాట్లాడుతూ.. భారత్‌లో సంప్రదాయ పొదుపరులున్నారని, వీరంతా పెట్టుబడిదారులుగా మారాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. సేవింగ్స్‌ను క్యాపిటల్ మార్కెట్లలో మదుపు చేస్తే.. దానివల్ల కుటుంబ సంపద మాత్రమే పెరగడంగాక, దేశం ఆర్థికంగాను వృద్ధి చెందుతుందని వివరించారు. కాబట్టి దేశీయ యువత తప్పకుండా పొదుపు నుంచి మదుపునకు మళ్లాలని ముకేశ్ అంబానీ పిలుపునిచ్చారు.
విద్య, వైద్య సంరక్షణ రంగాల్లో కృత్రిమ మేధస్సు (ఏఐ) గణనీయమైన మార్పులనే తేగలదని ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యుత్తమ విద్య, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రభావవంతమైన ప్రభుత్వ సేవలు ఏఐతో దేశంలోని 140 కోట్లమందికి అందుతాయన్న ధీమాను కనబర్చారు. ఇక బలమైన విధానాలు, రాజకీయ సుస్థిరత, విస్తృత శ్రేణి మౌలికాభివృద్ధి, డిజిటల్ విప్లవంపైనే భారత ఆర్థిక మూలాలు ఆధారపడి ఉన్నాయన్నారు.
5జీ, డిజిటల్ ఇండియా, క్యాపిటల్ మార్కెట్ల విస్తరణ వంటివి భారత్‌ను దీర్ఘకాల పెట్టుబడులకు క్రియాశీల వేదికగా మార్చుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి గ్రామంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటున్నదని, పైగా ఇతర దేశాలతో పోల్చితే చౌకగానే మెరుగైన 5జీ సేవలు లభిస్తున్నాయన్నారు. అంతేగాక దేశీయ ఇంధన అవసరాలు 80 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకోవాల్సిన పరిస్థితి కూడా మున్ముందు ఉండబోదన్నారు. మొత్తానికి భవిష్యత్తులో దేశంలో 100 కొత్త రిలయన్స్‌లను తాను చూడగలనన్న విశ్వాసాన్ని అంబానీ వెలిబుచ్చారు.
దీర్ఘకాలిక సంపద సృష్టికి భారత్ అతిపెద్ద అవకాశమని బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే వచ్చే 20-25 ఏండ్లు భారత్‌దేనని వ్యాఖ్యానించారు. రాబోయే దశాబ్దం, ఆపై కాలంలో భారత్ జీడీపీ వృద్ధిరేటు 8-10 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా, భారత్ వంటి వేగవంతమైన వృద్ధిదాయక దేశాల్లో సంపద సృష్టికి దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు ఎంతో దోహదం చేయగలవన్నారు. తాను కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు.
భారతీయులనూ పెట్టుబడులకు ప్రోత్సహిస్తానని తెలిపారు. ఇదిలావుంటే ‘ఏఐ బబుల్’ను తాను నమ్మబోనని స్పష్టం చేశారు. ఏఐలో మనం పెట్టుబడులు పెట్టకపోతే మున్ముందు చాలా ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అప్పుడు చైనానే గెలుస్తుందంటూ ఆ దేశం ఏఐలో ఎంత పెట్టుబడులు పెడుతున్నదో పరోక్షంగా ఫింక్ చెప్పడం గమనార్హం. కాగా, 7 నెలల క్రితం జియో బ్లాక్‌రాక్ తమ తొలి ఫండ్‌ను ప్రారంభించిందని, ఇప్పటిదాకా 10 లక్షల ఇన్వెస్టర్లు వచ్చారని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ కేవీ కామత్ తెలిపారు. ఇక సంస్థ మొదలైన దగ్గర్నుంచి 2 కోట్ల యూజర్లు నమోదయ్యారని ఆ కంపెనీ సీఈవో, ఎండీ హితేశ్ సేథియా వెల్లడించారు.