బడంగ్‌పేట, జనవరి 12: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు రెవెన్యూ పరిధిలో చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి సబిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులతో కలిసి కంపెనీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన చిరిపాల్ సంస్థ ఇక్కడ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థను నెలక్పొటం ఎంతో గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నదని, రాష్ట్రం లో సులభతరమైన పారిశ్రామిక విధానం ఉన్నదని, స్థానిక యువతకు ఉద్యోగ-ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఆదాయం పెరగాలంటే పారిశ్రామికాభివృద్ధి జరగాలన్నది ప్రభుత్వ అభిమతమని తెలియజేశారు. ఇక టిఎస్ ఐపాస్‌తో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, గడిచిన ఎనిమిదేండ్లలో 21 వేల కంపెనీలు తెలంగాణకు తరలి వచ్చాయని, 17 లక్షల మందికి ఉపాధి లభించిందని గుర్తుచేశారు. గుజరాత్లో 40 ఇండస్ట్రీలు ఉన్న సంస్థ.. మొదటిసారి ఆ రాష్ట్రం దాటి తొలి యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పటం ఆహ్వానించదగ్గ పరిణామమన్న మంత్రి.. కేటీఆర్ ఇచ్చిన భరోసాతోనే ఇక్కడ సజావుగా యూనిట్ ఏర్పాటు చేయగలిగామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు వివరించారు.
రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నదని, దేశ జీడీపీకన్నా రాష్ట్ర జీడీపీ వృద్ధి ఆకర్షణీయంగా ఉందంటే మన ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, సంస్థ చైర్మన్ వేద ప్రకాశ్, టిఎస్ఐఐసీ వైస్ చైర్మన్ నర్సింహ్మారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, తుక్కుగూడ వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి, సర్పంచ్ మద్ది సురేఖ కరుణాకర్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.