బీజింగ్, ఏప్రిల్ 11: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాను ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలుపుదల చేసినా.. చైనాకు మాత్రం ఆ ఊరటనివ్వలేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కూడా మరో 20 శాతం అదనపు సుంకాలు వేసి మొత్తం డ్రాగన్‌పై 145 శాతానికి చేర్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చైనా కూడా దీటుగా స్పందించింది. తమ దేశంలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై మరో 41 శాతం టారిఫ్‌లు పడుతాయని స్పష్టం చేసింది. దీంతో అమెరికాపై చైనా అదనపు సుంకాల భారం 84 శాతం నుంచి 125 శాతానికి పెరిగిపోయింది. శనివారం నుంచి పెంపు అమల్లోకి రానున్నది. కాగా, పరస్పర సుంకాలపై అమెరికాతో చర్చలకు సిద్ధమని చెప్తూనే.. బెదిరింపులకు పాల్పడితే ఊరుకోబోమని చైనా హెచ్చరిస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే ట్రంప్ దూకుడుకు తగ్గట్టుగా జిన్‌పిన్ సర్కారు ముందుకెళ్తున్నది చూస్తూనే ఉన్నాం. ఇక అమెరికా టారిఫ్‌ల పెంపు అంశాన్ని ప్రపంచ ఆర్థిక చరిత్రలో ఓ పెద్ద జోక్‌గా చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ అభివర్ణించింది. అంతేగాక 125 శాతం సుంకాల భారం వల్ల చైనాలో అమెరికా వస్తూత్పత్తులకు ఇక గిరాకీ ఉండబోదని, కాబట్టి మళ్లీ చైనాపై ట్రంప్ సుంకాలను పెంచినా.. దానికి మేమేమీ స్పందించబోమని కమిషన్ చెప్పింది. అయితే అమెరికా టారిఫ్‌లపై చివరిదాకా పోరాడుతామని పునరుద్ఘాటించింది.
ఈయూతో కలిసి ఉమ్మడి పోరు
అమెరికా ప్రతీకార సుంకాలపై ఆయా దేశాల మద్దతు కూడగట్టే పనిలో బిజిబిజీగా ఉన్న చైనా.. యూరోపియన్ యూనియన్ (ఈయూ)పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నది. ఈయూ కూటమిలో చాలా దేశాలు ఉండటం, ట్రంప్ ఎక్కువగా టారిఫ్‌లు వేసిన దేశాల జాబితాలో అవీ భాగం కావడంతో ఆ వైపు నుంచి డ్రాగన్ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే తాజాగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పిన్.. ఈ టారిఫ్ వార్‌పై ఉమ్మడి పోరుకు పిలుపునిచ్చారు. అందులో భాగం కావాలని ఈయూను కోరారు. ఇక ఈ వాణిజ్య యుద్ధంలో ఎవరూ విజేత కాలేరన్న ఆయన ప్రపంచంపై ఈ తరహా విధానాలను అనుసరిస్తే ఒంటరిగా మిగిలిపోతారని ట్రంప్‌ను హెచ్చరించారు. ఇప్పటికే అమెరికా తీరుపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చైనా ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.
టారిఫ్‌లకు బ్రేక్.. భారత్ ఏం చేయాలి?