న్యూఢిల్లీ, ఆగస్టు 24: గత కొన్నేండ్లుగా భారత్‌లోకి ఆగిన చైనా ఆధారిత పెట్టుబడులు మళ్లీ మొదలవుతున్నాయి. సరిహద్దుల్లో గల్వాన్ వద్ద ఇరు దేశాల సైనికుల కొట్లాట, చైనా దుశ్చర్యను ఖండిస్తూ 2020 ఏప్రిల్‌లో దేశంలోకి డ్రాగన్ పెట్టుబడులకు కేంద్రం నో ఎంట్రీ బోర్డు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మార్చిలో మోదీ సర్కార్ ఈ వైఖరిలో కొంత మెత్తబడింది. ఇందుకు సంబంధించి దాదాపు ఆరేండ్లుగా అనుసరించిన కఠిన విధానాన్ని సడలించింది.
ఇలా జరిగిన కేవలం 3 నెలల వ్యవధిలోనే సుమారు రూ.5,000 కోట్ల విదేశీ పెట్టుబడులు మారిన నిబంధనలకు అనుగుణంగా దేశంలోకి రావడం గమనార్హం. మరోవైపు వచ్చే నెలలో భారత్‌లో బ్రిక్స్ దేశాల సదస్సు జరుగనున్న క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సోమవారం బీజింగ్‌కు వెళ్లారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సరిహద్దు చర్చలు, బ్రిక్స్ సమావేశాలకు ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వీలుండటంతో చేపట్టాల్సిన సన్నాహాలపై మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోకి చైనా పెట్టుబడుల వార్తలు ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.
నిజానికి 2024 ద్వితీయార్ధం నుంచే భారత్-చైనా మధ్య నేరుగా విమాన రాకపోకలు మొదలయ్యాయి. వ్యాపార నిమిత్తం ప్రయాణాలు, సరిహద్దు వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు బలోపేతమయ్యాయి. ఈ క్రమంలో వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల రాజకీయపరంగానేగాక మార్కెటింగ్ అనుమతులు, ఎగుమతులు-దిగుమతులు, వాణిజ్య లోటు గురించి చర్చలు కూడా జరిపారు. దీంతో ఇక భారత్‌లోకి చైనా పెట్టుబడుల ప్రవాహం పుంజుకోవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెరిగే చైనా పెట్టుబడులు.. స్వదేశీ ఉత్పాదకతను దెబ్బతీయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకు గట్టి దెబ్బేనన్న వాదనలూ లేకపోలేదు.