న్యూయార్క్, ఏప్రిల్ 15: మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు ట్విట్టర్ కంపెనీ బోర్డ్ ఒక కొత్త ప్రణాళికను ఆమోదించింది. పరిమితకాలం అమల్లో ఉండే షేర్‌హోల్డర్ల రైట్స్ ప్లాన్‌ను తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించినట్టు శుక్రవారం ట్విట్టర్ తెలిపింది. ఈ ప్రణాళికను కార్పొరేట్ ప్రపంచంలో ‘విషపు గుళిక’ (పాయిజన్ పిల్) వ్యూహంగా వ్యవహరిస్తారు. ఈ ప్రణాళిక ప్రకారం ఏ వ్యక్తి అయినా, సంస్థ అయినా బోర్డు అనుమతి లేకుండా కంపెనీలో 15 శాతాన్ని మించి వాటా కొంటే, ఇతర వాటాదారులు డిస్కౌంట్ ధరలో మరిన్ని షేర్లను కొనవచ్చు. 2023 ఏప్రిల్ 14 వరకూ ఈ ప్రణాళిక అమల్లో ఉంటుందని ట్విట్టర్ బోర్డ్ పేర్కొంది. ఇతర షేర్హోల్డర్లు తక్కువ ధరతో షేర్లను కొనడం ద్వారా టేకోవర్‌పై కన్నేసిన వ్యక్తి లేదా సంస్థ వాటా శాతం తగ్గిపోతుంది.
ఆఫర్‌కు సౌదీ ప్రిన్స్ నో
ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించిన ఆఫర్‌ను సౌదీ అరేబియా యువరాజు, ట్విట్టర్లో ప్రధాన షేర్‌హోల్డర్ అయిన అల్ వలీద్ బిన్ తలాల్ తిరస్కరించారు. షేరుకు రూ. 54.20 డాలర్లు చెల్లిస్తానంటూ ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన ఆఫర్.. ట్విట్టర్‌కు ఉన్న వృద్ధి అవకాశాల దృష్ట్యా దాని అంతర్గత విలువకు దగ్గర్లో ఉందని తాను భావించడం లేదంటూ తలాల్ ట్వీట్ చేశారు. ‘ట్విటర్లో పెద్ద, దీర్ఘకాలిక షేర్హోల్డర్లమైన.. కింగ్డమ్ హోల్డింగ్ కంపెనీ (కేహెచ్సీ), నేను ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నాం’ అంటూ యువరాజు ట్వీట్లో పేర్కొన్నారు. ట్విట్టర్లో తనకు, తమ కంపెనీకి 5.2 శాతం వాటా ఉన్నట్టు 2015లో తలాల్ ప్రకటించారు.