Sam Altman | చాట్ జీపీటీ అడ్వాన్స్ టూల్స్ డెవలప్మెంట్పై ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు లేవనెత్తిన సందేహాలు నిజం అవుతాయా? అంటే.. చాట్ జీపీటీ రూపశిల్పి, దాని పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ స్టార్టప్ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అవుననే అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతారని కుండబద్ధలు కొట్టారు. ఇటీవల పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో శామ్ ఆల్ట్‌మన్ ఈ సంగతి తేల్చేశారు. చాట్ జీపీటీ తరహా చాట్ బోట్లను మనుషులు నియంత్రిస్తారన్న వాదనను కొట్టి పారేశారు. ఇప్పటికే ఏఐ చాట్ బోట్ వల్ల ఉద్యోగాలకు ఉద్వాసనలు పలికిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఐటీ, టెక్నాలజీ రంగంలోకి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అప్పటి వరకూ ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న నిపుణుల్లో తమ ఉద్యోగుల భవితవ్యంపై భయాందోళనలు ఉండేవి. చాట్ జీపీటీకి మూలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనా ప్రొఫెషనల్స్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏఐ ఆధారిత చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాల భద్రతకు ముప్పు లేదని కొందరు వాదిస్తున్నా.. పరిస్థితి అందుకు అనుకూలంగా లేదంటున్నారు. మనిషి నైపుణ్యానికి అనుగుణంగా ఏఐ టూల్ పని చేస్తుందని, పూర్తిస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదంటూ వస్తున్న వాదనలు పసలేనివంటూ శామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగ ఉద్యోగాలపై ఏఐ ఖచ్చితంగా ప్రభావం చూపుతుందన్నారు.
ఇప్పుడు చాట్‌జీపీటీ కంటే మెరుగైన ఏఐ టూల్ డెవలప్ చేయగల సత్తా తమ ఓపెన్ ఏఐకి ఉన్నా.. తక్షణం రిలీజ్ చేసేందుకు సిద్ధంగా లేమని శామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. ఏఐ అడ్వాన్స్ టూల్స్ ప్రభావం, తర్వాతీ పరిణామాలను ఊహించడం కూడా కష్టమేనన్నారు. మానవుడికి ఏఐ డెవలప్మెంట్ సవాల్ కాకుడదని శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని అనుబంధ చాట్ జీపీటీ తరహా చాట్బోట్ల పనితీరుపై నిత్యం పర్యవేక్షణతోపాటు నియంత్రణ తేవాల్సి ఉందన్నారు. ఇటీవల భారత్‌లో పర్యటించినప్పుడు కూడా ఏఐ చాట్బోట్లతో ఉద్యోగాలు పోతాయని నొక్కి చెప్పారు.