Income Tax | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 : ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలో సెక్షన్ 80సీ తెలియని ట్యాక్స్‌పేయర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఇదొక్కటే కాదు.. చాలా పాపులర్ సెక్షన్లు పన్ను చెల్లింపుదారులు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారి నోళ్లలో నానుతాయంటే ఎంతమా త్రం ఆశ్చర్యపోనవసరం లేదు. దాదాపు ఆరున్నర దశాబ్దాలుగా వాటికి అంతలా అలవాటుపడిపోయాం మరి. అయితే ఇకపై వీరందరికీ కొత్తగా చిక్కులు వచ్చిపడబోతున్నాయి. అవు ను.. నూతన ఆదాయ పన్ను బిల్లులో ఇప్పటిదాకా ఉన్న సీన్ అంతా మారిపోయింది. సెక్షన్ 80సీని క్లాజ్ 123గా మార్చారు. ఇదేకాదు.. ప్రస్తుత ఐటీ చట్టంలో సెక్లన్లుగా ఉన్నవన్నీ కొత్త చట్టంలో క్లాజుల రూపందాల్చాయి. గురువారం ఆదాయ పన్ను బిల్లు 2025ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం.. ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961 కంటే సరళతరంగా ఉంటుందన్నారు. అయితే ఆదా యం, పొదుపు, వ్యయాలకు సంబంధించి ప న్ను మినహాయింపులు, రిబేట్లు, క్యాపిటల్ గెయిన్స్ తదితరాలు వర్తించే సెక్షన్లను మార్చ డం వల్ల గందరగోళం నెలకొందన్న విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుండటం గమనార్హం.
దేశంలో ఉన్న వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులందర్నీ కొత్త ఐటీ విధానంలోకే తీసుకురావాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్నేండ్లుగా ప్రతీ బడ్జెట్లో కొత్త ఆదాయ పన్ను విధానాన్నే సవరించి మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. 2020 నుంచి పాత ఐటీ విధానం జోలికే వెళ్లట్లేదు మరి. ఇటీవలి బడ్జెట్లోనూ ఇదే జరిగింది. ఈ క్రమంలో కొత్త ఆదాయ పన్ను బిల్లు సైతం పాత ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకునేవారిని తికమకపెట్టేలా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ తెలిసిన సెక్షన్లను తీసేసి, క్లాజులుగా మార్చడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త ఐటీ విధానంలో సెక్షన్లతో పనిలేదన్న విషయం తెలిసిందే. వార్షిక ఆదాయం రూ.12 లక్షలు, స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలిపి రూ.12.75 లక్షలదాకా ఎవరికీ పన్నుండదు. అది దాటతే శ్లాబులవారీగా అందరికీ ఒకేలా పన్నులుంటాయి. ఎలాంటి మినహాయింపులకు తావుండదు. కానీ పాత ఐటీ విధానంలో రకరకాల సెక్షన్ల కింద పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎఫ్డీలు, ఈఎల్ఎస్ఎస్ వంటి సేవింగ్స్-పెట్టుబడులతోపాటు హెచ్ఆర్ఏ, బీమా ప్రీమియంలు, విద్య-గృహ రుణం వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులకు వీలున్నది. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు మరిన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి కూడా. ఇక ఐటీఆర్‌లు దాఖలు చేసేటప్పుడే చాలామందికి ఆయా సెక్షన్ల కింద గరిష్ఠంగా ఎంతదాకా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చో ఓ అవగాహన ఉంటుంది. కానీ కొత్త చట్టంలో ఆ సెక్షన్లన్నీ మాయమైపోతున్నాయి. దీంతో ఈ క్లాజులపై అవగాహన లేకపోతే ట్యాక్స్‌పేయర్స్‌కు నష్టమేనన్న ఆందోళనలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించి ఐటీఆర్‌లను దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
కొత్త ఆదాయ పన్ను బిల్లు చాలా సంక్లిష్టంగా ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ విమర్శించారు. పాత చట్టాన్ని సరళతరం చేస్తామన్న పేరుతో ఇంకా సంక్లిష్టం చేశారని దుయ్యబట్టారు. పాత చట్టంలో 296 సెక్షన్లే ఉన్నాయని, కొత్తదాంట్లో 500లకుపైగా ఉన్నాయని గుర్తుచేశారు. షెడ్యూళ్లను కూడా 5 నుంచి 14కు పెంచారని అప్పుడు ఇది ఏ రకంగా సరళతరమో అర్థం కావడం లేదని మండిపడ్డారు.