న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ వార్ నేపధ్యంలో చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ సీఈవో వేతనం ఏకంగా 52 శాతం ఎగబాకింది. అమెరికాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఎగ్జాన్మొబిల్ సీఈవో డారెన్ వుడ్స్ వార్షిక వేతనం 2022లో అనూహ్యంగా పెరిగింది.
కంపెనీకి విపరీతంగా లాభాలు రావడంతో వుడ్ వేతన ప్యాకేజ్ ఏకంగా 13.5 మిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 35.9 మిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ రాబడి విపరీతంగా పెరగడంతో పాటు షేర్ ధరలు ఎగబాకడంతో సీఈవో వేతనం భారీగా పెరిగిందని కంపెనీ వెల్లడించింది. గత ఏడాది కంపెనీ 5600 కోట్ల డాలర్ల లాభాన్ని ఆర్జించింది.
ఉక్రెయిన్ వార్ కారణంగా గత ఏడాది గ్లోబల్ ఆయిల్, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఎగ్జాన్మొబిల్ ఏ పాశ్చాత్య ఆయిల్ కంపెనీ ప్రకటించని రీతిలో అత్యధిక లాభాలను ఆర్జించిందని గార్డియన్ పేర్కొంది. వుడ్ నాయకత్వంలో ఎగ్జాన్మొబిల్ అసాధారణ వ్యాపార గణాంకాలను సాధించిందని కంపెనీ వెల్లడించింది. ఇక కంపెనీ షేర్ ధర కూడా పరిశ్రమ ప్రత్యర్ధులకు దీటుగా ఏకంగా 160 శాతం ఎగబాకింది.