న్యూఢిల్లీ, మార్చి 16: ప్రైవేటీకరణ బాటలోనున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆస్తుల విలువను గణించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైజాగ్ స్టీల్‌గా వ్యవహరించే ఆర్ఐఎల్ఎన్ కోసం అసెట్ వాల్యూయర్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) బిడ్స్‌ను ఆహ్వానించింది. ఇన్సాల్వెన్సీ బాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వద్ద రిజిష్టరైన అసెట్ వాల్యూయర్ సంస్థలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనొచ్చు. బిడ్స్ సమర్పించేందుకు చివరితేదీ ఏప్రిల్ 4. ఇందుకోసం నియమితులైన వాల్యూయర్ ఆర్ఐఎన్ఎల్, దాని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్ల అన్ని ఆస్తుల విలువనూ లెక్కించాల్సి ఉంటుంది. వీటి ప్లాంట్, యంత్రాలు, భూమి, భవనాలు, ఫర్సీచర్, పౌర మౌలిక వసతులన్నింటి విలువను గణించి ప్రభుత్వానికి నివేదికనివ్వాలి. వైజాగ్ స్టీల్‌లో 100 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు జనవరి 27న కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయ అనుమతిని తెలిపింది.