న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పింఛన్ పథకం (ఈపీఎస్) 1995లో ఉన్న పెన్షనర్లు త్వరలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ లేదా శాఖ నుంచైనా తమ పెన్షన్ను తీసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఈపీఎస్ 1995 కోసం ప్రతిపాదించిన కేంద్రీకృత పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (సీపీపీఎస్)కు మాండవియా నేతృత్వంలోని ఈపీఎఫ్వో ట్రస్టీల సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది.
పింఛన్ కోసం తిప్పలుండవు
‘సీపీపీఎస్ ఆమోదం ఈపీఎఫ్వో ఆధునికీకరణలో ఓ కీలక మైలురాయి. దేశంలోని ఏ బ్యాంక్ నుంచైనా లేదా ఏ బ్యాంక్ శాఖలోనైనా తమ పెన్షన్ను పొందే వెసులుబాటు పెన్షనర్లకు సీపీపీఎస్ ఇస్తున్నది. దీంతో పెన్షన్ల కోసం తిరిగే తిప్పలు, ఎదురుచూసే పరిస్థితులు, ఇతరత్రా సమస్యలు పింఛన్దారులకు తప్పనున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎంతగానో కలిసి రానుంది. పదవీ విరమణానంతర జీవితం మరింత బాగుంటుంది. పింఛన్ పంపిణీని ప్రభావవంతంగా, వేగవంతంగా చేస్తున్నాం’ అని సదరు ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈపీఎఫ్వో సభ్యులకు, పెన్షనర్లకు మరింత మెరుగైన సేవల్ని అందించే దిశగా తాము చేపట్టిన చర్యలు ఫలప్రదం అవుతున్నాయన్న ఆనందాన్నీ మాండవియా వ్యక్తం చేశారు.
ఆధార్ ద్వారా చెల్లింపులు
ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏబీపీఎస్)కూ సీపీపీఎస్ మార్గం సుగమం చేయనుందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అంటున్నది. ఈపీఎఫ్వో చేపట్టిన ఐటీ ఆధునికీకరణ ప్రాజెక్ట్.. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనబుల్డ్ సిస్టమ్ (సీఐటీఈఎస్ 2.01) తొలి దశ కింద సీపీపీఎస్ను తెచ్చామని, దీని ద్వారానే మలి దశలో ఏబీపీఎస్ను తెస్తామని చెప్తున్నది. నిజానికి ఇప్పుడున్న పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఈపీఎఫ్వో జోనల్/ప్రాంతీయ కార్యాలయాల ఆధారంగా నడుస్తున్నది. కేవలం 3-4 బ్యాంకులతోనే ఇవి ప్రత్యేక ఒప్పందాలను చేసుకున్నాయి. దీంతో ఆయా బ్యాంకులు, శాఖల ద్వారానే పింఛన్ల పంపిణీ ఉంటున్నది. ఫలితంగా ఇతర బ్యాంకుల్లో ఖాతాలున్న పెన్షనర్లకు సమస్యలు తప్పడం లేదు. సీపీపీఎస్తో ఇక ఈ కష్టాలన్నీ తీరుతాయని కార్మిక శాఖ అంటున్నది. అంతేగాక పింఛన్ పంపిణీకయ్యే ఖర్చూ తగ్గుతుందని ఈపీఎఫ్వో భావిస్తున్నది.