
హైదరాబాద్, అక్టోబర్ 7: సిమెంట్ ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెలలో ఇప్పటికే బస్తా ధర రూ.10 నుంచి 50 వరకు పెరిగింది. ముంబై, గుజరాత్ మార్కెట్లలో గరిష్ఠంగా రూ.50 ఎగిసిందని చెప్తున్న డీలర్లు.. ఉత్తర, దక్షిణాది రాష్ర్టాల్లో రూ.10-50 ఎగబాకిందంటున్నారు. దీంతో 50 కిలోల బస్తా సగటు ధర దేశంలో రూ.385కు చేరింది. తయారీ ఖర్చులతో మరింత పెరుగవచ్చన్న అంచనాలు కూడా పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. ఫలితంగా కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితులపై అటు సిమెంట్ కంపెనీలు, ఇటు నిర్మాణ, అనుబంధ రంగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పెట్‌కోక్, విద్యుత్తు, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులు పెరిగిపోవడంతోనే సిమెంట్ ధరలను పెంచుతున్నామని కంపెనీలు చెప్తున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ రంగంతోపాటు మౌలిక రంగ ప్రాజెక్టులను పూర్తిచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం కూడా సిమెంట్ డిమాండ్‌ను అమాంతం పెంచేసిందని, ఈ పరిణామం కూడా ధరల పెంపునకు దారితీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సిమెంట్‌తోపాటు స్టీల్ భగభగమండుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కిలో సలాక ధర రూ.6 మేర పెరిగింది. దీంతో మూడు రోజుల క్రితం రూ.52 గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.58కి చేరుకున్నది. టన్ను స్టీల్ ధర రూ.6 వేలు పెరిగి రూ.52 వేల నుంచి రూ.58 వేలకు ఎగబాకింది.

ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సిమెంట్ బస్తా ధర 10-15 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ సంకేతాలిస్తున్నది. పెరిగిన తయారీ ఖర్చులతో తగ్గిన ఆదాయం, లాభాలను తిరిగి పెంచుకోవడానికి మరింత పెంపు తప్పదని అంటున్నారు. అయితే సిమెంట్ ధరలు పెరిగితే నిర్మాణ రంగంతోపాటు అనుబంధ రంగాలపైనా ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది కరోనాతో స్తంభించిన మార్కెట్‌పై సెకండ్ వేవ్ పిడుగు పడిందని, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో అధిక ధరలు డిమాండ్‌ను అడ్డుకుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న పెట్‌కోక్ ధరలు కొద్దినెలలుగా మునుపెన్నడూ లేనంత పెరిగాయి. మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో సిమెంట్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమవుతున్నది. బస్తా ధర మరో 60 రూపాయలు పెరుగవచ్చు.
-దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం