Cement | న్యూఢిల్లీ, జూన్ 17: రుతుపవనాల కదలికలతో ఈసారి వర్షాకాలం ముందుగానే రావడం వల్ల మార్కెట్లో సిమెంట్ గిరాకీ ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ చెప్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) సిమెంట్ డిమాండ్ దాదాపు 75 శాతానికి పరిమితమైందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24) ఇది 77 శాతంగా ఉన్నదని గుర్తుచేస్తున్నది. ఈ క్రమంలో వర్షాల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) కూడా సిమెంట్ గిరాకీ సన్నగిల్లే వీలుందని అంటున్నది.
అధిక సరఫరాతో..
మార్కెట్లోకి డిమాండ్‌కు మించి సిమెంట్ సరఫరా కావడంతో దేశంలోని దక్షిణాది రాష్ర్టాల్లో సిమెంట్ ధరలు కొంతమేర పడిపోయినట్టు వ్యాపార, పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. తూర్పు రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తేలింది. సహజంగానే వర్షాలు పడితే నిర్మాణ పనులు ఆగిపోతాయి. ఇండ్లు, ఇతర ప్రాజెక్టులు నిలిచిపోతాయి. దీంతో వర్షాకాలంలో ఎప్పుడైనా సిమెంట్‌కు గిరాకీ తక్కువే. అయితే ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే వచ్చింది. మే నెలలోనే చాలాచోట్ల వర్షాలు విస్తారంగా పడటం మొదలైంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో అమ్మకాలు తగ్గిపోయాయి. దీనికితోడు కంపెనీలు ఉత్పత్తిని పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకురావడంతో రేట్లు కూడా పడిపోయినట్టు చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 5 నుంచి 6 శాతానికే వృద్ధిరేటు పరిమితమైంది. 2020-21 కరోనా సమయంలో తర్వాత ఈ స్థాయి వృద్ధి కనిపించడం ఇదే.